Maratha quota: ‘మరాఠా కోటా’ ఇచ్చేందుకు మా ప్రభుత్వం సుముఖంగా ఉంది: మహారాష్ట్ర సీఎం

‘మరాఠా కోటా’ (Maratha quota) డిమాండ్‌పై మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. చట్టపరంగా రిజర్వేషన్ల అమలుకు సమయం కావాలని పేర్కొంది.

Published : 01 Nov 2023 16:35 IST

ముంబయి: మరాఠా (Maratha quota) సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఇచ్చేందుకు మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం అనుకూలమేనని ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) చెప్పారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కొందరు గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కోటా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కార్యకర్త మనోజ్‌ జరంగే పాటిల్‌ తన దీక్షను విరమించాలని ఈ సందర్భంగా నేతలు ఓ తీర్మానం చేశారు. దానిపై సీఎం ఏక్‌నాథ్‌ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, శివసేన యూబీటీ నేత ఉద్ధవ్‌ ఠాక్రే తరఫున హాజరైన అనిల్‌ పరాబ్‌లు సంతకాలు పెట్టారు. చట్టపరంగా రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రభుత్వానికి కొంచెం సమయం కావాలని, అంతవరకు మరాఠా సామాజికవర్గం నేతలు సంయమనం పాటించాలని శిందే అన్నారు. ఈ విషయంపై జరంగే కూడా ప్రభుత్వానికి సహరించాలని ఆయన కోరారు. 

‘మరాఠా కోటా’ ఆందోళనల వేళ.. మంత్రి వాహనంపై దాడి

అంతకముందు జరంగే మీడియాతో మాట్లాడుతూ తమకు ప్రత్యేకంగా కోటా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, కుంబీ కులంలో చేర్చితే సరిపోతుందని చెప్పారు. మరాఠాలు కుంబీ కులానికి చెందిన వారని, ఆ కులం ఓబీసీ కేటగిరీ కిందకి వస్తుందని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల అంశాన్ని పరిష్కరించేందుకు శిందే ప్రభుత్వం ఓ విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ లక్షల మంది ధ్రువపత్రాలను పరిశీలించింది. వారిలో కేవలం 11,530 మంది మాత్రమే కుంబీలుగా ధ్రువపత్రాలను కలిగి ఉన్నారని ఆ కమిటీ నివేదిక పేర్కొంది. 

‘మరాఠా కోటా’ ఆందోళనల నేపథ్యంలో మహారాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు వాటిలోకి దూరి పరిస్థితిని మరింత జటిలం చేయొద్దని సీఎం శిందే సూచించారు. అల్లర్ల కారణంగా మరాఠ్వాడా ప్రాంతంలోని ఐదు జిల్లాల్లో ఇప్పటికే ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేశారు. ఆందోళనకారులు ఇద్దరు ఎమ్మెల్యేల నివాసాలను నిప్పు పెట్టిన నేపథ్యంలో బీడ్‌లో కర్ఫ్యూ విధించి వ్యక్తులు గుమిగూడటాన్ని అధికారులు నిషేధించారు. ఇదిలా ఉండగా.. మరాఠా సామాజిక వర్గ ప్రజలకు అధికారులు కొత్తగా కుంబీ కుల ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వారు ఓబీసీ ప్రయోజనాలు పొందే అవకాశం లభించినట్లయింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని