Dwaraka: జలాంతర్గామిలో వెళ్లి ‘ద్వారక’ చూడొచ్చు.. సముద్ర గర్భంలో వీక్షణకు ఏర్పాట్లు!

శ్రీకృష్ణుడు నిర్మించిన సముద్ర గర్భంలోని ద్వారక నగరాన్ని వీక్షించేందుకు గుజరాత్‌ ప్రభుత్వం జలాంతర్గామి సర్వీసులను సిద్ధం చేస్తోంది. దీనిపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 27 Dec 2023 20:46 IST

ద్వారక: దేశంలోనే సుప్రసిద్ధమైన క్షేత్రాల్లో ద్వారక ఒకటి. ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకొనేందుకు వేలాది మంది భక్తజనం ఏటా తరలివస్తుంటారు. మహాభారత కాలంలో శ్రీకృష్ణ భగవానుడు విశ్వకర్మ సహాయంతో నిర్మించిన ఈ సుందర నగరం అరేబియా సముద్రంలో మునగడంతో భక్తులెవరూ అక్కడికి వెళ్లలేకపోతున్నారు. ఈ ప్రాచీన నగరాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా గుజరాత్‌ ప్రభుత్వం జలాంతర్గామి సేవలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ముంబయికి చెందిన ప్రభుత్వ రంగ నౌకా సంస్థ మజాగాన్‌తో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది.  ద్వాపరయుగం అనంతరం అరేబియా సముద్రంలో మునిగిన ఈ పురాతన నగరాన్ని సందర్శించే గొప్ప అవకాశాన్ని కల్పించేందుకు సన్నాహాలు చేస్తుండటంపై యాత్రికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సముద్రంలో 300 అడుగుల దిగువ వరకు..

ఈ జలాంతర్గామికి 24మంది యాత్రికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుందని గుజరాత్‌ పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు. పర్యాటకులతో పాటు ఇద్దరు పైలట్లు, ఇద్దరు డైవర్లు, టెక్నీషియన్‌, గైడ్‌ కూడా ఉంటారని వెల్లడించారు. ఈ జలాంతర్గామి భక్తులను అరేబియా సముద్రంలో 300 అడుగుల దిగువకు తీసుకెళ్తుందని.. అక్కడి నుంచి పురాతన నగర శిథిలాలతో పాటు అరుదైన సముద్ర జీవాలను చూడగలరని పేర్కొన్నారు.  ఈ సేవలతో గుజరాత్‌లో పర్యాటక రంగం అభివృద్ధిచెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

భక్తుల్లో ఆనందం..

గుజరాత్‌ ప్రభుత్వం జలాంతర్గామి సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధమవుతుండటంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మేం ద్వారకకు వచ్చాక ఇక్కడ సబ్‌మెరైన్‌ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఇప్పుడు మేము మా పిల్లలను సముద్రంలోనికి తీసుకెళ్లి ఆ మహానగర శిథిలాలను వీక్షించవచ్చు. ద్వారకను సందర్శిస్తే గొప్ప అనుభూతి కలుగుతుంది. జలాంతర్గామి సౌకర్యాన్ని త్వరగా ప్రారంభించాలని కోరుకుంటున్నాను.. తద్వారా మేం ఈ స్థలాన్ని రెండోసారి సందర్శించవచ్చు’’ అని పర్యాటకురాలు అక్షిత బ్రహ్మభట్ట అన్నారు.  ‘‘శ్రీకృష్ణుడు రాజ్యమేలిన ప్రదేశాన్ని చూసే అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ జలాంతర్గామిని ప్రారంభించాలని కోరుకుంటున్నా. పురాతన ద్వారక నగరం శ్రీకృష్ణుడు పాలించిన రాజ్యం అని చాలా మంది నమ్ముతారు. ప్రతిపాదిత జలాంతర్గామి సర్వీస్‌ వార్త యాత్రికల్లో ఆనందం నింపుతోంది’’ అని రాఖీ శర్మ అనే మరో యాత్రికురాలు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని