Farmers protest: 14వేల మంది రైతులు..1200 ట్రాక్టర్లు: మళ్లీ మొదలుకానున్న ‘దిల్లీ చలో’

Farmers protest: తమ డిమాండ్ల పరిష్కారం కోసం రైతులు మరోసారి నిరసనకు సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించిన వారు.. అది ముగిసిన తర్వాత దిల్లీ వైపు తమ ప్రయాణం కొనసాగిస్తామని ప్రకటించారు.

Updated : 21 Feb 2024 10:49 IST

దిల్లీ: పంటకు కనీస మద్దతు ధర అంశంలో కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు.. ‘దిల్లీ చలో’(Delhi Chalo) పేరిట తమ నిరసనను నేడు తిరిగి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం పంజాబ్, హరియాణా మధ్య ఉన్న శంభు సరిహద్దు వద్ద వారు దిల్లీ దిశగా కదలనున్నారు. దాంతో దేశ రాజధానిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. (Farmers protest)

దిల్లీ వైపు వెళ్లేందుకు శంభు వద్ద 14వేల మంది రైతులు, 1200 ట్రాక్టర్లు, 300 కార్లు, 10 మినీ బస్సులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అలాగే బారికేడ్లను ధ్వంసం చేసే పరికరాలను వారు తమ వెంట తీసుకెళ్తున్నారు. వాటిని స్వాధీనం చేసుకోవాలని హరియాణా పోలీసులు.. పంజాబ్ బలగాలను అభ్యర్థించారు. మరోపక్క దిల్లీలోకి ప్రవేశించే మార్గాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇదిలా ఉంటే.. కనీస మద్దతు ధరపై చట్టం తీసుకువచ్చేందుకు కేంద్రం ఒకరోజు పార్లమెంట్‌ను సమావేశపర్చాలని రైతు నాయకుడు శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ కోరారు. తమ మార్చ్‌ను అడ్డుకునేందుకు హరియాణాలోని సరిహద్దు గ్రామాల్లో పారామిలిటరీ బలగాలను మోహరించారని ఆరోపించారు. ‘మేం చేసిన నేరం ఏమిటి..? మిమ్మల్ని ప్రధానిని చేశాం. మమ్మల్ని అణచివేసేందుకు ఈ విధంగా బలగాలను ఉపయోగిస్తారని అనుకోలేదు. మేము అసలు డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గేలా కేంద్రం ప్రతిపాదనలు చేసింది. ఇప్పుడు ఏం జరిగినా దానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని పంథేర్‌ హెచ్చరించారు. ఈ పరిణామాలపై కేంద్ర హోం శాఖ పంజాబ్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఆందోళనకారుల్లో కొందరు శంభు వద్దకు బుల్డోజర్లు, ఎర్త్‌ మూవర్స్ వంటివి తీసుకువచ్చారని వెల్లడించింది. భారీ మెషినరీని, ట్రాక్టర్లను ఆపరేట్‌ చేసే వ్యక్తులకు టియర్ గ్యాస్ ,రబ్బర్ బుల్లెట్ల నుంచి నుంచి రక్షణ కల్పించేలా క్యాబిన్లకు ఐరన్ షీట్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని