వీల్‌ఛైర్‌ లేక.. కుమారుడిని స్కూటర్‌పై మూడో అంతస్తుకు తీసుకెళ్లిన తండ్రి

ఆసుపత్రుల్లో సరైన వసతులు లేక రోగులు అవస్థలు పడిన ఘటనలు గతంలో అనేకం చూశాం. తాజాగా ఓ తండ్రి వీల్‌ఛైర్‌ (wheelchair) లేక గాయపడిన తన కుమారుడిని స్కూటర్‌పై ఎక్కించుకుని పైఅంతస్తుకు తీసుకెళ్లారు.

Updated : 17 Jun 2023 15:26 IST

కోట: రాజస్థాన్‌ (Rajasthan)లోని ఓ ఆసుపత్రిలో వీల్‌ఛైర్‌ (WheelChair) అందుబాటులో లేకపోవడంతో ఓ తండ్రి గాయపడిన తన కుమారుడిని స్కూటర్‌పై ఎక్కించుకుని పై అంతస్తుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. కోట (Kota) జిల్లాలో గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  వివరాల్లోకి వెళితే..

కోట ప్రాంతానికి చెందిన మనోజ్‌ జైన్‌ వృత్తిరీత్యా న్యాయవాది. ఆయన కుమారుడికి ఇటీవల కాలు ఫ్రాక్చర్‌ అయ్యింది. కట్టు మార్పించేందుకు గత గురువారం స్థానిక ఎంబీఎస్‌ ఆసుపత్రి (Hospital)కి తీసుకొచ్చారు. ఆర్థోపెడిక్‌ వార్డు మూడో అంతస్తులో ఉంది. అయితే అక్కడ వీల్‌ఛైర్‌ అందుబాటులో లేదు. దీంతో మనోజ్‌ జైన్‌ తన కుమారుడిని స్కూటర్‌పై ఎక్కించుకుని పై అంతస్తుకు తీసుకెళ్లారు. మనోజ్‌, ఆయన కుమారుడు స్కూటర్‌పై లిఫ్ట్‌ వరకు వెళ్లి అందులో ఎక్కి మూడో అంతస్తుకు వెళ్లారు. కట్టు మార్పించుకుని మళ్లీ అలాగే కిందకు వచ్చారు.

అయితే, తిరిగి వస్తుండగా వార్డ్‌ ఇన్‌ఛార్జ్‌ వారిని అడ్డుకుని స్కూటర్‌ తాళాలు తీసుకున్నారు. దీంతో మనోజ్‌ జైన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీల్‌ఛైర్‌ లేకపోవడంతోనే తాను ఇలా చేయాల్సి వచ్చిందని ఆసుపత్రి యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. చక్రాల కుర్చీ కోసం తాను సిబ్బందిని అడిగానని, వారు లేదని చెప్పడంతో సిబ్బంది అనుమతి తీసుకునే స్కూటర్‌పై తీసుకెళ్లానని చెప్పారు. అయినా.. తనను అడ్డుకున్నారని ఆసుపత్రి యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. సమాచారమందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పారు.

మనోజ్‌ స్కూటర్‌పై వెళ్తున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో ఇది కాస్తా వివాదాస్పదంగా మారింది. ఆసుపత్రి తీరుపై పలువురు మండిపడుతున్నారు. అయితే తమ వద్ద వీల్‌ఛైర్ల కొరత ఉందని, దీన్ని త్వరలోనే పరిష్కరిస్తామని ఆసుపత్రి యాజమాన్యం ఆ తర్వాత వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని