Gautam Gambhir: భారతీయుడిగా సిగ్గుపడుతున్నా.. మణిపుర్‌ ఘటనపై గంభీర్ ఆగ్రహం

మణిపుర్‌లో మహిళలపై జరిగిన అమానుష కాండపై భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో భారతీయులుగా మనమంతా సిగ్గుతో తలదించుకోవాలన్నారు.

Published : 21 Jul 2023 17:49 IST

దిల్లీ: అల్లర్లతో అట్టుడుకుతోన్న ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, వారిని నగ్నంగా ఊరేగించిన ఘటన (Manipur Video) యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనపై భాజపా (BJP) ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది దేశానికి అవమానకరమని, తోటి భారత పౌరుడిగా తాను సిగ్గుపడుతున్నానని అన్నారు. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ఇది అత్యంత అవమానకర ఘటన. ఇది కేవలం మణిపుర్‌కు మాత్రమే పరిమితమైంది కాదు. యావత్‌ దేశాన్ని తలదించుకునేలా చేసింది. ఈ ఘటనతో తోటి భారతీయుడిగా సిగ్గుపడుతున్నా’’ అని గంభీర్‌ (Gautam Gambhir) ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, దీన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు.

దేశాన్ని రక్షించినా.. భార్యను కాపాడుకోలేకపోయా..! బాధిత మహిళ భర్త దీనగాథ

‘‘మణిపుర్‌ ఘటనపై కొందరు (ప్రతిపక్షాలను ఉద్దేశించి) రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. అయితే, ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. మహిళలపై జరిగిన ఈ అమానుషం.. మొత్తం దేశానికే సిగ్గుచేటు. ఇలాంటి దారుణం జరిగినందుకు భారతీయులుగా మనమంతా సిగ్గుతో తలదించుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకుండా చూసుకోవాలి. బాలికలు, మహిళల రక్షణకు అన్ని రాష్ట్రాలు కట్టుబడి ఉండాలి’’ అని గంభీర్‌ తెలిపారు.

మణిపుర్ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతంగా చేశారు. ఇప్పటివరకు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. జాతుల మధ్య వైరంతో ఈ ఏడాది మే నెలలో మణిపుర్‌లో ఘర్షణలు మొదలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల్లో భాగంగానే మే 4వ తేదీన ఓ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలపై కొందరు పురుషులు క్రూరత్వానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవడంతో రాజకీయంగా దుమారం రేగింది. దీనిపై ప్రధాని మోదీ నిన్న స్పందిస్తూ బాధ్యులను వదిలిపెట్టేది లేదని భరోసా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని