‘ఆ దాడిలో మావాళ్లు100 మంది గాయపడ్డారు’

ఇరాక్‌లోని వైమానిక స్థావరంపై జరిగిన క్షిపణి దాడిలో తమ సైనికుల్లో 100 మందికి తేలికపాటి మెదడు సంబంధిత గాయాలైనట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ వెల్లడించింది............

Published : 11 Feb 2020 10:22 IST

అమెరికా రక్షణవిభాగం పెంటగాన్‌

వాషింగ్టన్‌: ఇరాక్‌లోని వైమానిక స్థావరంపై జరిగిన క్షిపణి దాడిలో తమ సైనికుల్లో 100 మందికి తేలికపాటి మెదడు సంబంధిత గాయాలైనట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ వెల్లడించింది. గత నెల విడుదల చేసిన ప్రకటనలో 34 మందే అని తెలిపిన అమెరికా తాజా ఆ సంఖ్యను సవరించి 100కు చేర్చింది. ‘‘గతంతో పోలిస్తే మరో 45 మందిలో ‘మైల్డ్‌ ట్రామాటిక్‌ బ్రెయిన్‌ ఇంజురీ(ఎంటీబీఐ)’ని గుర్తించాం. దీంతో ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య 109కి చేరింది’’ అని పెంటగాన్‌ తన ప్రకటలో పేర్కొంది. వీరిలో 76 మంది కోలుకొని విధుల్లో చేరినట్లు వెల్లడించింది. మరికొంత మంది ఇంకా వైద్య పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నారు. సైనికులు పూర్తిగా కోలుకోవడానికి విశేష సేవలందించిన వైద్యులకు పెంటగాన్‌ ధన్యవాదాలు తెలిపింది. గతంలో అధ్యక్షుడు ట్రంప్‌ దీనిపై మాట్లాడుతూ..సైనికులకు పెద్ద ప్రమాదమేమీ లేదని.. ‘కేవలం తలనొప్పి’ అంటూ తేలిగ్గా కొట్టిపారేయడం గమనార్హం. 
దాడి జరిగిన మరుసటి రోజు అమెరికా సైనికులకు ఎటువంటి గాయాలు కాలేదని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. గాయాలైన సమాచారం ఆలస్యంగా వెలుగులోకి రావడంపై పెంటగాన్‌ వివరణ కోరింది. వైద్య పరీక్షల అనంతరం నివేదికలతో సహా సమాచారం అంచెలంచెలుగా ఉన్నతాధికారులకు చేరడానికి సమయం పట్టిందని పేర్కొంది. అలాగే మెదడు సంబంధిత వ్యాధుల్లో పూర్తి స్థాయి లక్షణాలు బయటకు రావడానికి సమయం పడుతుందని తెలిపింది. 

క్షిపణి పేలుడు వల్ల వాతావరణ పీడనంలో మార్పులు చోటుచేసుకోవడంతో ఎంటీబీఐ తరహా సమస్యలు తలెత్తుతాయని వైద్యులు తెలిపారు. ఇరాన్‌ అగ్రశ్రేణి కమాండర్‌ జనరల్‌ ఖాసీం సులేమానీని అమెరికా డ్రోన్‌ దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణులతో విరుచుకుపడింది. అయితే ఆ సమయంలో సైనికులెవరూ స్థావరంలో లేకపోవడంతో వారెవరికీ ఏమీ కాలేదని తొలుత అమెరికా ప్రకటించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు