ఇరాన్‌ నుంచి భారత్‌ చేరుకున్న నాలుగో బృందం

ఇరాన్‌ నుంచి మరో 53 మంది భారతీయులు సోమవారం తెల్లవారుజామున దిల్లీకి చేరుకున్నారు. ఆ దేశం నుంచి వచ్చిన నాలుగో బృందం ఇది. వీరిలో 52 మంది విద్యార్థులు కాగా............

Updated : 16 Mar 2020 13:43 IST

దిల్లీ: ఇరాన్‌ నుంచి మరో 53 మంది భారతీయులు సోమవారం తెల్లవారుజామున రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ దేశం నుంచి వచ్చిన నాలుగో బృందం ఇది. వీరిలో 52 మంది విద్యార్థులు కాగా, ఒకరు టీచర్‌. వీరిని అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రానికి తరలించారు. దీంతో ఇప్పటి వరకు ఇరాన్‌ నుంచి 389 మంది భారత్‌కు చేరుకున్నారు. ఇందుకు సహకరించిన ఇరాన్‌ ప్రభుత్వానికి విదేశాంగమంత్రి జైశంకర్‌ కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి భారత రాయబార కార్యాలయ కృషిని అభినందించారు. ఇరాన్‌లో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులందరినీ స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా గత మంగళవారం 58 మంది, శుక్రవారం 44 మంది, ఆదివారం 234 మంది రాగా 53 మందితో కూడిన చివరి బృందం ఈరోజు భారత్‌కు చేరుకుంది. ఆదివారం భారత్‌కు చేరుకున్న వారిని దిల్లీలోని ఛావ్లా ప్రాంతంలో ఐటీబీపీ ఏర్పాటుచేసిన క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.

ఇక ఇరాన్‌లో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 724కు చేరింది. మరో 14,000 మంది బాధితులుగా మారారు. వైరస్‌ వ్యాప్తి క్రమంగా పెరుగుతుండడంతో జనసంచారంపై అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. వైరస్‌ బాధితుల్లో కీలక నేతలు, ఉన్నతాధికారులు కూడా ఉండడం అక్కడ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఇటు భారత్‌లో బాధితుల సంఖ్య 110కి చేరింది.   


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని