
కూలీల తరలింపునకు ప్రత్యేక రైళ్లు
స్వస్థలాలకు తరలించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
దిల్లీ: లాక్‌డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కూలీలు, విద్యార్థులు, యాత్రికులు, ఇతరులను రైళ్లలో తరలించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. వారిని తమ తమ స్వస్థలాలకు పంపించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. కూలీలు తరలింపునకు రైలు సేవలు వినియోగించుకునేలా మార్గదర్శకాలను సవరిస్తూ హోంశాఖ ఉత్తర్వులు వెలువరించింది. ప్రత్యేక రైళ్లను రైల్వేమంత్రిత్వ శాఖ నడుపుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
దీనికి సంబంధించి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయం చేసుకునేందుకు ఓ నోడల్ అధికారిని రైల్వే శాఖ నియమిస్తుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం మాట్లాడుకుని, రైల్వే శాఖతో సంప్రదించి ఈ రైళ్లు ఏర్పాటు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. శ్రామిక ప్రత్యేక రైళ్లు పేరిట వీటిని ఇవాల్టి నుంచి నడపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రైలు ఎక్కించేటప్పుడు, గమ్యస్థానం చేరుకున్న తరువాత అక్కడి ప్రభుత్వ అధికారులు స్వయంగా వచ్చి తీసుకువెళ్లేలా చూడాలని ఆదేశాల్లో పేర్కొంది. టికెట్ల విక్రయం, రైళ్లు, రైల్వే స్టేషన్, ప్లాట్‌ఫాంపై భౌతిక దూరానికి సంబంధించి మార్గదర్శకాలను రైల్వేశాఖ జారీ చేయనుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు అన్ని జోనల్ మేనేజర్లకు రైల్వే శాఖ ప్రత్యేక ఆదేశాలు పంపింది.
ఇప్పటికే తెలంగాణ నుంచి ఝార్ఖండ్‌కు 1200 మంది వలస కూలీలతో ప్రత్యేక రైలు ఇవాళ ఉదయం బయలుదేరిన సంగతి తెలిసిందే. అలాగే ట్రక్కుల రవాణాకు అనుమతివ్వాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది. సరకు రవాణాకు ఇబ్బందుల లేకుండా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఆ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాత్సవ తెలిపారు. వలస కూలీలు, విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరారు. ఈ మేరకు దిల్లీలో సంయుక్త మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
Advertisement