ఆరోగ్యసేతు:సమాచారం భద్రంగా ఉందన్న కేంద్రం

ఆరోగ్య సేతు యాప్‌ వాడకం వల్ల ఏవిధమైన సమాచార ఉల్లంఘన జరగడం లేదని బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది.

Updated : 06 May 2020 15:01 IST

లోపాలను వెంటనే సరిదిద్దాలంటూ హెచ్చరించిన హ్యాకర్‌

దిల్లీ: ఆరోగ్య సేతు యాప్‌ వాడకం వల్ల ఏవిధమైన సమాచార ఉల్లంఘన జరగడం లేదని బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది.  90 మిలియన్ల భారతీయుల గోప్యత ప్రమాదంలో ఉందంటూ ఫ్రెంచ్ ఎథికల్ హ్యాకర్‌ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఈ స్పష్టతనిచ్చింది. ‘ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిన సమాచారం కూడా ప్రమాదంలో ఉందని ఈ ఎథికల్ హ్యాకర్‌ నిరూపించలేకపోయారు’ అని ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై ఎలియట్‌ ఆల్డర్‌సన్‌ పేరుతో ఉన్న ట్విటర్‌ ఖాతా నుంచి హ్యాకర్‌ తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. ‘ఇక్కడ చూడటానికి ఏమీ లేదని మీరు చెప్తున్నారు. కానీ మేం చూస్తాం. నేను మళ్లీ రేపు మీ ముందుకు వస్తాను’ అని ట్వీట్ చేశాడు. 

మంగళవారం పౌరుల సమాచార భద్రతకు సంబంధించి హ్యాకర్‌ వరస ట్వీట్లు చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. ‘హాయ్‌, ఆరోగ్య సేతు. మీ యాప్‌లో భద్రతాపరమైన లోపం ఉంది. 90 మిలియన్ల బారతీయుల సమాచారం ప్రమాదంలో ఉంది. నన్ను ప్రైవేటుగా సంప్రందించగలరా? రాహుల్ గాంధీ చెప్పింది సరైంది’ అని రాహుల్ గాంధీని ట్యాగ్ చేశాడు. ఆ వెంటనే దీనికి సంబంధించి ఇండియన్‌ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్ తనను సంప్రదించిందని తెలిపాడు. వెంటనే ప్రభుత్వం ఆ లోపాలను సరిద్దికపోతే వాటిని ప్రజల ముందు పెడతానని, తనకు ఓపిక తక్కువని మరో ట్వీట్ చేశాడు. 

కేంద్రం అందుబాటులోకి తెచ్చిన ఈ యాప్‌ కొవిడ్ 19కు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ప్రధాని మోదీతో సహా ఇతర మంత్రులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ సూచించారు. అయితే దీనిపై కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదొక అధునాతన నిఘా వ్యవస్థ అంటూ ఆరోపించారు. అయితే ఆయన వాదనను కేంద్రం కొట్టిపారేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని