
జ్యోతికుమారిని ప్రశంసించిన ఇవాంక ట్రంప్
తండ్రిని వెంటబెట్టుకొని 1200 కిమీ సైకిల్‌పై ప్రయాణం..
ఇంటర్నెట్‌డెస్క్: లాక్‌డౌన్ వేళ ఇటీవల తండ్రిని వెంటబెట్టుకొని 1200కిమీ సైకిల్ తొక్కిన బిహార్ బాలిక జ్యోతికుమారిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ శుక్రవారం అభినందించారు. తండ్రి పట్ల జ్యోతికున్న ప్రేమను ట్విటర్‌లో కొనియాడారు. ‘అది ఎంతో అందమైన ఓర్పుతో కూడిన ప్రేమ’ అని ప్రశంసించారు. జ్యోతి సాహసాన్ని దేశ ప్రజలతో పాటు భారత సైక్లింగ్ ఫెడరేషన్ కూడా గుర్తించిందని ఇవాంక ట్వీట్ చేశారు.
అసలేం జరిగిందంటే.. బిహార్‌కు చెందిన మోహన్ పాశ్వాన్ కుటుంబ పోషణ కోసం గురుగ్రామ్‌లో ఆటో నడిపేవారు. లాక్‌డౌన్‌కు ముందే ఆయన ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో మార్చిలో తండ్రిని చూడ్డానికి వచ్చిన మోహన్ కుమార్తె జ్యోతికుమారి(15) లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయింది. మోహన్ నడవలేని స్థితిలో ఉండటం, ఇంటి అద్దె చెల్లించే పరిస్థితి కూడా లేకపోవడంతో యజమాని ఖాళీ చేయమని ఒత్తిడి తెచ్చాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉండటం కష్టంగా మారి, తన తండ్రితో సహా జ్యోతి బిహార్‌లోని సొంతూరు దార్‌భంగా వెళ్లాలని నిర్ణయించుకుంది. అప్పటికీ బస్సులు, రైళ్లు నిలిచిపోవడంతో ఉన్న కొద్దిపాటి డబ్బుతో సైకిల్ కొని దానిపై 1200 కిమీ దూరంలో ఉన్న సొంతూరుకు వెళ్లాలనుకుంది. అలా తన తండ్రిని సైకిల్‌పై వెనకాల కూర్చొబెట్టుకొని జ్యోతి ప్రయాణం సాగించింది. ఆ ప్రయాణంలో అనేక కష్టాలను ఎదుర్కొని ఏడు రోజుల తర్వాత ఆమె స్వగ్రామానికి చేరింది. ఈ వార్త తెలిసి భారత సైక్లింగ్ సమాఖ్య జ్యోతిని ట్రయల్స్‌కు ఆహ్వానించింది. వచ్చేనెల దిల్లీలో నిర్వహించే ట్రయల్స్‌లో ఆమె అర్హత సాధిస్తే జాతీయ సైక్లింగ్ అకాడమీలో ఉచితంగా శిక్షణ అందిస్తామని సమాఖ్య వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.