మిడతలతో విమానాలకూ ముప్పే!

మిడతల దండు వల్ల అటు కేవలం పంటలకే కాదు.. ఇటు విమానాలకూ ముప్పు పొంచి ఉందంటోంది వైమానిక రంగ నియంత్రణ సంస్థ (డీజీసీఏ). ముఖ్యంగా విమానాలు టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయంలో ఈ దండు వల్ల సమస్యలు........

Published : 29 May 2020 19:24 IST

పైలట్లు, ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలి
మార్గదర్శకాలు విడుదల చేసిన డీజీసీఏ

దిల్లీ: మిడతల దండు వల్ల అటు కేవలం పంటలకే కాదు.. ఇటు విమానాలకూ ముప్పు పొంచి ఉందంటోంది వైమానిక రంగ నియంత్రణ సంస్థ (డీజీసీఏ). ముఖ్యంగా విమానాలు టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయంలో ఈ దండు వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొంది. ఇలాంటి సమయంలో మిడతల దండు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పైలట్లకు, ఇంజినీర్లకు శుక్రవారం డీజీసీఏ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.

కరోనాపై పోరాడుతున్న వేళ మిడతల రూపంలో దేశానికి కొత్త సమస్య ఎదురైన సంగతి తెలిసిందే. తొలుత రాజస్థాన్‌లో కనిపించిన  ఈ దండు ఇప్పుడు పంజాబ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌కు కూడా విస్తరించింది. ఇటీవలే దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో వీటి వల్ల ఇబ్బందులు పొంచిన ఉందని గ్రహించిన డీజీసీఏ కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది.

మిడతలు తక్కువ ఎత్తులో ఎగురుతాయి కాబట్టి విమానాలు టేకాఫ్‌/ ల్యాండింగ్‌ సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని డీజీసీఏ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ సమయంలో విమానాల్లోని అన్ని ప్రవేశ ద్వారాల్లోకి ఇవి పెద్ద సంఖ్యలో చొచ్చుకెళ్లే ప్రమాదముందని తెలిపింది. దండు మీదుగా ప్రయాణించినప్పుడు విమానం తాలూకా పిటాట్‌, స్టాటిక్‌ నాళాలు (గాలి వేగాన్ని అంచనా వేసే పరికరాలు) పాక్షికంగా లేదా పూర్తిగా మూసుకుపోయే ప్రమాదముందని పేర్కొంది. అవి మూసుకుపోతే వాటి నుంచి తప్పుడు సంకేతాలు అందుతాయని, ఎయిర్‌ స్పీడ్‌, అల్టీ మీటర్‌ సూచీలు సరిగా పనిచేయకపోవచ్చని తెలిపింది.

ఈ దండు ఎదురుగా వస్తున్నప్పుడు వైపర్లను వేయడం వల్ల మరకలు పడే అవకాశం ఉందని డీజీసీఏ తెలిపింది. అలాగే మిడతల గుంపును గుర్తించినట్లయితే వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బంది వచ్చీపోయే విమానాల సిబ్బందికి సమాచారం ఇవ్వాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. విమాన సిబ్బంది కూడా ఈ సమాచారాన్ని పరస్పరం ఇతర సిబ్బందితో పంచుకోవాలని సూచించింది. నిలిపి ఉంచిన విమానాలనూ తనిఖీ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించింది. రాత్రివేళ్లలో ఈ గుంపు సంచరించకపోవడమనేది ఊరట కల్పించే అంశమంటూ తన మార్గదర్శకాల్లో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని