సంక్షిప్త వార్తలు (15)
భూమిపై పర్వతారణ్యాలు హరించుకుపోతున్నాయి. 2001-2018 మధ్య ఏడాదికి 52 లక్షల హెక్టార్ల చొప్పున పర్వతారణ్యాలు హరించుకుపోయాయని బ్రిటన్‌లోని లీడ్స్ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం లెక్కగట్టింది.
కనుమరుగవుతున్న పర్వతారణ్యాలు
దిల్లీ: భూమిపై పర్వతారణ్యాలు హరించుకుపోతున్నాయి. 2001-2018 మధ్య ఏడాదికి 52 లక్షల హెక్టార్ల చొప్పున పర్వతారణ్యాలు హరించుకుపోయాయని బ్రిటన్‌లోని లీడ్స్ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం లెక్కగట్టింది. 2000 నుంచి పుడమి మొత్తం 7.81 కోట్ల హెక్టార్ల పర్వతారణ్యాలను కోల్పోయింది. కలప కోసం చెట్లు కొట్టేయడం వల్ల 42% పర్యతారణ్య క్షయం సంభవించింది. కార్చిచ్చుల వల్ల 29%, పోడు వ్యవసాయం వల్ల 15%, తాత్కాలిక, శాశ్వత సేద్యం వల్ల 10% పర్వతారణ్యాలు అదృశ్యమయ్యాయి. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పసిఫిక్ దీవుల్లో పర్వతారణ్య క్షీణత తక్కువే. ఆగ్నేయాసియా దేశాల్లో వ్యవసాయ విస్తరణ వల్ల ఈ తరహా నష్టం పెరిగిపోయింది. ప్రపంచ పర్వతారణ్యాల క్షయంలో 42% ఉష్ణమండల పర్వతారణ్యాల్లోనే సంభవించినా అక్కడ 23% ప్రాంతాల్లో చెట్లు మళ్లీ పెరిగాయి.
రైతుల పాదయాత్రకు దిగొచ్చిన మహా సర్కారు
డిమాండ్లను నెరవేరుస్తూ ఉత్తర్వులు
ముంబయి: రాష్ట్రప్రభుత్వం దిగిరావడంతో నాసిక్ నుంచి ముంబయి వరకు చేపట్టిన మహాపాదయాత్రను నిలిపివేస్తున్నట్లు శనివారం మహారాష్ట్ర రైతులు, గిరిజనులు ప్రకటించారు. తమ డిమాండ్లకు రాష్ట్రప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, ఉత్తర్వులు కూడా జారీ చేసిందని యాత్రకు నేతృత్వం వహించిన నేతలు తెలిపారు. ఈ నెల 12న నాసిక్‌నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమెంiది. ముంబయి వరకు జరపాలనే లక్ష్యంతో రైతులు కదం తొక్కారు. ధరల పతనంతో తీవ్రంగా నష్టపోయిన ఉల్లి రైతులకు క్వింటాలుకు రూ.600 తక్షణ సాయం, వ్యవసాయానికి 12 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా, రైతు రుణమాఫీ తదితర 14 డిమాండ్లను వీరు ప్రభుత్వం ముందు ఉంచారు. శనివారం ఈ పాదయాత్ర ముంబయికి 80 కిలోమీటర్ల దూరంలోని ఠాణె జిల్లాలోకి చేరుకుంది. శుక్రవారం అసెంబ్లీలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే.. క్వింటాలు ఉల్లికి రూ.350 సాయం అందిస్తామని ప్రకటించారు. ‘‘మా డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు కలెక్టర్లకు, స్థానిక యంత్రాంగానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో యాత్రను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాం’’ అని సీపీఎం ఎమ్మెల్యే వినోద్ నికోలె తెలిపారు.
బంగ్లాదేశ్‌కు డీజిల్ పైపులైను ప్రారంభం
వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధానులు మోదీ, షేక్ హసీనా
దిల్లీ: భారత్ నుంచి బంగ్లాదేశ్ ఉత్తర ప్రాంతానికి డీజిల్ సరఫరా చేసే పైపులైనును శనివారం రెండు దేశాల ప్రధానులు మోదీ, షేక్ హసీనా వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.377 కోట్లతో నిర్మించిన ఈ పైపులైనువల్ల రవాణా వ్యయంతోపాటు కాలుష్యం తగ్గనుంది. ప్రస్తుతం 512 కిలోమీటర్ల రైల్వే లైనుద్వారా బంగ్లాదేశ్‌కు డీజిల్ సరఫరా అవుతోంది. కొత్తగా వేసిన 131.5 కిలోమీటర్ల పైపులైను ద్వారా ఏడాదికి 10లక్షల టన్నుల డీజిల్ సరఫరా కానుంది.
ఏప్రిల్ 1 కంటే ముందు తరగతులు ప్రారంభించొద్దు
సీబీఎస్‌ఈ ఉత్తర్వు
దిల్లీ: కేంద్ర బోర్డు పరిధిలోని పాఠశాలలు ఏప్రిల్ 1 కంటే ముందు కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించవద్దని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ముందుగా తరగతులు ప్రారంభించడం వల్ల విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతారని తెలిపింది. పలు పాఠశాలలు ముఖ్యంగా 10, 12 తరగతులను ముందస్తుగా ప్రారంభిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సీబీఎస్‌ఈ ఈ ప్రకటన చేసింది. ‘‘కొన్ని అనుబంధ పాఠశాలలు కొత్త విద్యా సంవత్సరాన్ని చాలా ముందే ప్రారంభిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇది విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తుంది. తద్వారా చదువుతోపాటు ఇతర ఆహ్లాద వ్యాపకాలకు వారు దూరమవుతారు. కాబట్టి, బోర్డు పరిధిలోని ప్రిన్సిపాళ్లు మా సూచనలు కచ్చితంగా పాటించాలి’’ అని సీబీఎస్‌ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీబీఎస్‌ఈ పరిధిలోని 10, 12 తరగతుల విద్యార్థులకు ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు వరుసగా మార్చి 21.. ఏప్రిల్ 5 తేదీల్లో ముగియనున్నాయి.
కాశీ ఆలయ దర్శనంలో సీఎం యోగి ఘనత
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అరుదైన ఘనత సాధించారు. 100 సార్లకు పైగా కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించుకున్న సీఎంగా రికార్డు సృష్టించారు. 2017లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నుంచి ఇప్పటివరకు సగటున 21 రోజులకు ఒకసారి కాశీనాథుని దర్శించుకుంటున్నారు యోగి. ఆయన నెలలో రెండుసార్లు కాశీ వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. వచ్చిన ప్రతిసారి అభివృద్ధి పనుల సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తుంటారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో బావికి, తోటకి పెళ్లి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రెయిచ్ జిల్లాలో బావికి, తోటకి పెళ్లి చేశారు. ఈ వివాహ వేడక కోసం పత్రికలు సైతం ముద్రించి చుట్టుపక్కల గ్రామస్థులను ఆహ్వానించారు. ఈ వేడుకలో మొత్తం 1,500 మంది ప్రజలు అతిథులుగా పాల్గొన్నారు. బావికి, తోటకి పెళ్లి చేసే ఈ వింత ఆచారం.. కైసర్‌గంజ్ ప్రాంతంలోని కద్‌సర్ బితౌరా గ్రామంలో ఉంది. ఇలా వివాహం చేయడం తమ సంప్రదాయంలో భాగమని 80 ఏళ్ల దేవి బక్ష్ సింగ్ తెలిపారు. కొత్తగా పెళ్లి చేసుకునే వారు ఈ బావి వద్దకు వచ్చి పూజలు చేస్తారని స్థానికులు వెల్లడించారు.
జమ్మూ-కశ్మీర్‌లో జీ-20 సదస్సు ఖాయం
ఇంటర్నెట్‌డెస్క్: జమ్మూ-కశ్మీర్‌లో జీ-20 సదస్సు నిర్వహించే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకూడదని భారత్ నిర్ణయించింది. ఇప్పటికే పాకిస్థాన్ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా చైనా, తుర్కియే, సౌదీ అరేబియాతో కలిసి లాబీయింగ్ చేపట్టింది. కానీ, భారత్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇటీవల ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో జీ-20 సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఉత్తరాన కశ్మీర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు ఇవి జరుగుతాయన్నారు. వచ్చే వారం ఓ జీ-20 సమావేశం అరుణాచల్‌ప్రదేశ్‌లో కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. అమెరికా 12, చైనా 14, ఇండోనేసియా 25 నగరాల్లో జీ-20 సదస్సులు నిర్వహించాయని గుర్తుచేశారు. జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించాక పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయని ప్రపంచానికి తెలియజేసేందుకు కేంద్రం జీ-20 సదస్సును వేదికగా వాడుకోవాలనుకుంటోంది.
రాజస్థాన్‌లో కొత్తగా 19 జిల్లాల ఏర్పాటు
సీఎం అశోక్ గహ్లోత్ ప్రకటన
జైపుర్: రాజస్థాన్‌లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్తగా 19 జిల్లాలు, 3 డివిజన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటికి మౌలిక వసతుల కల్పన, మానవ వనరులకు గాను రూ.2,000 కోట్లు కేటాయించారు. 2008 నుంచి రాజస్థాన్‌లో కొత్త జిల్లాలేవీ ఏర్పాటు కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాలున్నాయి. తాజాగా జైపుర్‌ను 4, జోధ్‌పుర్‌ను 3 జిల్లాలుగా విభజిస్తుండటంతో.. వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 50కి చేరుతుంది.
ప్రభుత్వం బాధ్యతాయుత కక్షిదారే కావాలి
జస్టిస్ దినేశ్ మహేశ్వరి
దిల్లీ: కోర్టు కేసుల్లో ప్రభుత్వం బాధ్యతాయుత కక్షిదారుగానే ఉండాలని, తప్పనిసరి పరిస్థితుల్లో జోక్యం చేసుకున్నామనే ఉద్దేశంతో ఉండకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ మహేశ్వరి స్పష్టం చేశారు. కార్యనిర్వాహక వ్యవస్థ వివాద పరిష్కార విధానాలను అమలు చేయాలని, మొక్కుబడిగా అఫిడవిట్ దాఖలు చేసి వదిలేయవద్దని సూచించారు. శనివారం దిల్లీలో జరిగిన కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ 40వ వార్షికోత్సవంలో న్యాయమూర్తి ప్రసంగించారు. కేసుల పెండింగ్‌ను తగ్గించేలా స్పష్టతతో తుది నిర్ణయాలను వెలువరించాలని ట్రైబ్యునళ్లకు సూచించారు. వివాదాల విషయంలో ప్రభుత్వం అనుసరించే ధోరణే సరైన మార్గానికి దారి చూపుతుందని, బాధ్యతాయుతమైన కక్షిదారు అంటే వివాదం నుంచి తప్పించుకోవడం కాదని స్పష్టం చేశారు.
ఈశాన్య దిల్లీ అల్లర్ల కేసులో.. 19 మందిపై గృహదహనం,హత్యాయత్నం అభియోగాలు
దిల్లీ: ఈశాన్య దిల్లీలో 2020 ఫిబ్రవరి 24న జరిగిన అల్లర్ల కేసులో 19 మందిపై గృహదహనం, హత్యాయత్నం అభియోగాలు నమోదు చేయాల్సిందిగా స్థానిక సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజధాని స్కూలు యజమాని అయిన ఫైసల్ ఫరూఖ్‌తోపాటు మరో 18 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఫరూఖ్ ప్రోద్బలంతో నిందితులు శివ్ విహార్ తిరాహ ప్రాంతంలోని డీఆర్పీ పాఠశాల, దాని అనుబంధ ఆస్తులను తగులబెట్టిన కేసు కోర్టులో విచారణకు వచ్చింది. ప్రాసిక్యూషను కథనం మేరకు.. నిందితులు రాజధాని స్కూలును తమ స్థావరంగా చేసుకొని ఓ వర్గానికి చెందిన ఆస్తులపై పెట్రోలు బాంబులు, రాళ్లు విసిరారు. పాఠశాల నుంచి విలువైన వస్తువులను లూటీ చేశారు.
శిక్షణ విమానం కూలి ఇద్దరి మృతి
బాలాఘాట్: మధ్యప్రదేశ్‌లోని నక్సల్స్ ప్రభావిత కొండ ప్రాంతం బాలాఘాట్‌లో శనివారం శిక్షణ విమానం కూలి అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో విమాన చోదక శిక్షకుడు మోహిత్ ఠాకుర్ (25), ట్రైనీ పైలట్ వృక్షాంక మహేశ్వరి (20) మరణించారు. మధ్యాహ్నం 3.06 గంటలకు గోండియా జిల్లాలో టేకాఫ్ అయిన విమానం 3.11 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలను కోల్పోయింది. వాతావరణం సరిగా లేని కారణంగా అది కూలిపోయినట్లు అధికారులు తెలిపారు.
దేశ సమగ్రతను దెబ్బతీసే వాదనలతో అప్రమత్తంగా ఉండండి
మీడియాకు కేంద్రమంత్రి విజ్ఞప్తి
కొచ్చి: దేశ సమగ్రతను దెబ్బతీసేలా కొందరు చేస్తున్న వాదనలపట్ల మీడియా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి అనురాగ్ ఠాకుర్ సూచించారు. దేశంలోనూ, బయటా ఇటీవల కొందరు నిరాధార, నిర్హేతుక వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇవి దేశ ప్రజాస్వామ్య వాతావరణాన్ని దెబ్బ తీస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలపట్ల మీడియా జాగరూకతతో వ్యవహరించాలని కోరారు. శనివారం కొచ్చిలో ‘మాతృభూమి’ మళయాల దినపత్రిక శత వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నిజాలు పవిత్రమైనవని, అభిప్రాయాలు స్వేచ్ఛాయుతమైనవన్న సామెతను ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలోనూ, బయటా నిరాధార, నిర్హేతుక అభిప్రాయాలను ఎందరు వ్యక్తం చేసినా మన ప్రజాస్వామ్యం గొప్పదనే విషయమే వాస్తవమని స్పష్టం చేశారు. నకిలీ, అవాస్తవ వాదనలను అడ్డుకోవడానికి మాతృభూమిలాంటి పత్రికలు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ బాధిత కుటుంబాలకు సాయం పెంపు
రాయ్‌పుర్: నక్సల్స్ చేతిలో హత్యకు గురైన బాధిత కుటుంబాలకు అందజేసే ఆర్థికసాయాన్ని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పెంచనుంది. నక్సల్స్ ఏరివేతలో భాగంగా విధులు నిర్వర్తిస్తూ మరణించిన పోలీసుల కుటుంబాలకు.. వ్యవసాయ భూమి కొనుగోలుకు రూ.20 లక్షలు అందించనుంది. అలాగే, వారి చేతిలో మరణించిన పౌరుల కుటుంబాలకు రూ.10 లక్షలు, లొంగిపోయిన నక్సల్స్‌కు రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు రివార్డు అందించాలని నిర్ణయించింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ఉన్నతాధికారి శనివారం తెలిపారు. నక్సల్ చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం ఇస్తుంది. ఉద్యోగం చేసేవారు లేనిపక్షంలో ఆ కుటుంబానికి వ్యవసాయ భూమి కొనుగోలు కోసం ఆర్థిక సాయం అందించనుంది.
ర్యాప్ షోను అడ్డుకొన్న కర్ణిసేన
ఇందౌర్: మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో శుక్రవారం రాత్రి ఓ హోటల్‌లో జరుగుతున్న ఎం.సి.స్టైన్ ర్యాప్ షోను కర్ణిసేన కార్యకర్తలు అడ్డుకొన్నారు. అతడు పాడుతున్న పాటల్లో అసభ్య పదజాలం ఉందంటూ గొడవకు దిగి కార్యక్రమాన్ని ఆపు చేయించారు. దీంతో రియాలిటీ టీవీ షో ‘బిగ్‌బాస్’ 16వ సీజన్ విజేత అయిన ర్యాపర్ ఎం.సి.స్టైన్ షో మధ్యలో వెళ్లిపోయారు. ఈ వివాదానికి సంబంధించి శనివారం కర్ణిసేన కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద నగర పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని వెల్లడించారు. కర్ణిసేన నేతలైన దిగ్విజయ్‌సింగ్, రాజాసింగ్‌లతోపాటు ఇతర నిందితులను వీడియో ఫుటేజి పరిశీలన ద్వారా గుర్తిస్తున్నట్లు తెలిపారు.
ఇవేం పార్లమెంటు సమావేశాలు?
పార్లమెంటు సమావేశాలు ఏమాత్రం ఫలప్రదంగా సాగడం లేదు. సభ్యులు సహనం పాటించడం లేదు. అర్థవంతమైన చర్చలు జరపడం లేదు. జాతీయ సమస్యలను పరిష్కరించే ప్రయత్నమే చేయడం లేదు. దేశ ప్రజలు ఇలాంటి సభను కోరుకోవట్లేదు. భారత్‌ను విభజించకుండా ఏకం చేద్దాం.
కపిల్ సిబల్
ప్రతి ఒక్కరిపైనా వాతావరణ మార్పుల ప్రభావం
వాతావరణ మార్పులతో ప్రపంచంలోని ప్రతి ఒక్కరిపైనా దుష్ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ ఉపద్రవాన్ని అరికట్టడానికి అన్ని దేశాలూ కలసికట్టుగా కృషి చేయాలి. మొక్కుబడి ప్రకటనలకు పరిమితం కాకుండా చిత్తశుద్ధితో కార్యాచరణను చేపడితేనే ఫలితం ఉంటుంది. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను అత్యవసరంగా తగ్గించాలి.
టెడ్రోస్ అధనోం
మోసగాళ్లకు గౌరవం.. స్థానికులకు హింస..
ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నతోద్యోగినని చెప్పుకొన్న గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తికి జమ్మూ-కశ్మీర్ అధికారులు రాచమర్యాదలు చేశారు. ఫైవ్ స్టార్ హోటల్‌లో వసతి, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, జడ్ ప్లస్ భద్రత కల్పించారు. మోసగాళ్లను ఇంతగా నమ్మే అధికారులు కశ్మీర్‌లోనే పుట్టి పెరిగిన స్థానికులను మాత్రం నిత్యం అనుమానిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు.
మెహబూబా ముఫ్తీ
ప్రమాదంలో పది లక్షల జాతులు
ఈ భూమిపై ఉన్న జీవరాశిలో సుమారు పది లక్షల జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జీవవైవిధ్య ప్రాముఖ్యతను మనం విస్మరించకూడదు. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు విద్యా విధానాలు, పాఠ్యాంశాల్లో మార్పులు తేవాలి. పుడమి పరిరక్షణ కోసం విద్యను అభ్యసించాల్సిన సమయం వచ్చింది.
యునిసెఫ్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Anam Ramanarayana Reddy: అక్కడంతా ఏకఛత్రాధిపత్యమే.. వాళ్లకి భజనపరులే కావాలి: ఆనం రామనారాయణరెడ్డి
-
Sports News
Shubman Gill: నేను సెలక్టర్నైనా.. అదే పని చేసేవాణ్ని: శిఖర్ ధావన్
-
India News
Amritpal Singh: ‘అమృత్‌పాల్ పోలీసులకు లొంగిపో’.. అకాల్‌తక్త్ పిలుపు
-
World News
Putin: పుతిన్ కీలక నిర్ణయం.. బెలారస్లో అణ్వాయుధాల మోహరింపు
-
Movies News
Harish Shankar: ఉస్తాద్ భగత్‌సింగ్‌పై నెటిజన్ ట్వీట్.. డైరెక్టర్ కౌంటర్
-
Sports News
Virat Kohli: విరాట్ ‘జెర్సీ నంబరు 18’ వెనుక.. కన్నీటి కథ