జనన, మరణాల లెక్కలతో ఓటర్ల జాబితా సవరణ కొత్త విధానం తెస్తాం: అమిత్‌ షా

జనన, మరణాల నమోదు ఆధారంగా భవిష్యత్తులో ఓటర్ల జాబితాలో ఆటోమేటిక్‌గా మార్పులు చేసే ప్రక్రియను ప్రారంభించబోతున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వెల్లడించారు.

Published : 23 May 2023 04:39 IST

ఈనాడు, దిల్లీ: జనన, మరణాల నమోదు ఆధారంగా భవిష్యత్తులో ఓటర్ల జాబితాలో ఆటోమేటిక్‌గా మార్పులు చేసే ప్రక్రియను ప్రారంభించబోతున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. జననాల జాబితాలో పేర్లు నమోదైన వారికి 18 ఏళ్లు నిండిన వెంటనే నేరుగా ఎన్నికల సంఘం సందేశం పంపుతుందని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తుందని, ఆ వెంటనే పేర్లు ఓటర్ల జాబితాలో చేరిపోతాయని తెలిపారు. ఎవరైనా చనిపోతే మరణాల జాబితా ద్వారా ఎన్నికల సంఘానికి సమాచారం వెళ్తుందని, దాని ఆధారంగా మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకు నోటీసు పంపి, వివరణ తీసుకుని, 15 రోజుల్లో పేరును తొలగించేలా నిబంధనలు తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి ఎన్నో మార్పులతో వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. డేటాను ఒకచోట అప్‌డేట్‌ చేస్తే అన్నిచోట్లా అయ్యేలా కొత్త విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. సోమవారం దిల్లీలో  జనగణన భవన్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. జనాభా లెక్కల సేకరణ కోసం జియోఫెన్సింగ్‌ అప్లికేషన్‌ను రూపొందించామని, క్షేత్ర స్థాయిలో జనాభా లెక్కలు సేకరించేవారు తమకు కేటాయించిన బ్లాక్‌లో పర్యటించకుండా లెక్కలు నమోదు చేస్తే వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం వెళ్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్లాక్‌లనూ ఇప్పుడు జియోఫెన్సింగ్‌ చేస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని