Viral Video: ఐకమత్యంగా ఉండి కొమ్ములతో పొడిచి.. గేదెల దాడిలో పులి మృతి

సాధారణంగా ‘పులి దాడిలో గేదె మృతి’ అనే వార్తలు చూస్తాం. కానీ  గేదెలు పులి మీద మూకుమ్మడిగా దాడి చేసి హతమార్చిన అరుదైన ఘటన ఇది.

Updated : 22 Jul 2023 08:48 IST

బల్లార్ష, న్యూస్‌టుడే: సాధారణంగా ‘పులి దాడిలో గేదె మృతి’ అనే వార్తలు చూస్తాం. కానీ  గేదెలు పులి మీద మూకుమ్మడిగా దాడి చేసి హతమార్చిన అరుదైన ఘటన ఇది. మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రపూర్‌ జిల్లా మూల్‌ తాలూకా పరిసరాల్లో కొంతకాలంగా పులి సంచరిస్తూ.. స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. గురువారం ఉదయం మూల్‌ తాలూకాలోని ఎస్‌గావ్‌ గ్రామ పరిసరాల్లో ఓ పశువుల కాపరిపై దాడికి యత్నించింది. చేతిలో ఉన్న గొడ్డలితో ఎదురు తిరగడంతో త్రుటిలో అతడికి ప్రాణాపాయం తప్పింది. తర్వాత  బెంబాడా గ్రామంలోని అటవీ పరిసరాల్లో మేత మేస్తున్న ఆవులు, గేదెలపై పులి దాడి చేసింది. ఈక్రమంలో గేదెలు భయంతో పరుగెత్తకుండా.. ఐకమత్యంగా ఉండి పులిని కొమ్ములతో పొడిచాయి. దీంతో పులి తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం దానిని అటవీశాఖ అధికారులు చంద్రపూర్‌ తరలించారు. చికిత్స పొందుతూ పులి అదేరోజు రాత్రి చనిపోయిందని అధికారులు పేర్కొన్నారు. గేదెలు పులిని ఎదిరించిన దృశ్యాలను అక్కడే ఉన్న పశువుల కాపరులు తమ ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు