శిఖరాగ్ర సంబరం

సర్వాంగ సుందరంగా ముస్తాబైన దిల్లీ.. అతిరథ మహారథుల రాక.. అత్యంత కట్టుదిట్టమైన భద్రతల మధ్య ప్రపంచానికి దిశానిర్దేశం చేసే రెండు రోజుల జీ20 సదస్సు శనివారం ప్రారంభం కాబోతోంది.

Updated : 09 Sep 2023 07:06 IST

జీ20కి సర్వం సిద్ధం
సర్వాంగ సుందరంగా ముస్తాబైన దిల్లీ
అతిరథుల రాక ప్రారంభం
దిల్లీ చేరుకున్న బైడెన్‌, సునాక్‌
పలు దేశాల నేతలు కూడా
50 వేల మందితో కట్టుదిట్టమైన భద్రత
నేటి నుంచే సదస్సు
కీలక నిర్ణయాలపై చర్చలు
డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయానికి భారత్‌ తీవ్ర ప్రయత్నం
మానవాళి కేంద్రంగా సమ్మిళిత వృద్ధికి కొత్త దారి వేస్తాం: మోదీ
దిల్లీ

ర్వాంగ సుందరంగా ముస్తాబైన దిల్లీ.. అతిరథ మహారథుల రాక.. అత్యంత కట్టుదిట్టమైన భద్రతల మధ్య ప్రపంచానికి దిశానిర్దేశం చేసే రెండు రోజుల జీ20 సదస్సు శనివారం ప్రారంభం కాబోతోంది. అంగరంగ వైభవంగా తీర్చిదిద్దిన ప్రగతి మైదాన్‌లోని భారత్‌ మండపంలో ఈ సదస్సు జరగబోతోంది. భారత్‌ తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న ఈ సదస్సుపై భారీ అంచనాలే ఉన్నాయి. దక్షిణార్ధ గోళ దేశాల ఆందోళనలు, ఉక్రెయిన్‌ యుద్ధంతో నెలకొన్న దారుణ పరిస్థితులు, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థలకు పరిష్కారం చూపుతూ భౌగోళికంగా ముక్కలైన రాజకీయ వాతావరణానికి చికిత్స చేసి సమ్మిళిత వృద్ధి దిశగా ప్రపంచాన్ని పరుగులు పెట్టించడంపై ఈ సదస్సు దృష్టి సారించనుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌తోపాటు ప్రపంచ సంస్థల అధినేతలు పాల్గొంటున్న ఈ సదస్సు పలు కీలక నిర్ణయాల దిశగా సాగనుంది. చైనా, రష్యా అమెరికాతో విభేదిస్తున్న వేళ సదస్సులో డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కోసం భారత్‌ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఈ సదస్సుకు భారత్‌ కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేసింది. అతిథులకు ఘన స్వాగతం నుంచి సదస్సు విజయవంతం అయ్యేవరకూ ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూస్తోంది. ఈ సదస్సు ద్వారా మానవాళి కేంద్రంగా సమ్మిళిత అభివృద్ధికి కొత్త దారి వేస్తామని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. వసుధైక కుటుంబం పేరుతో ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు నినాదంగా భారత్‌ ఈ సదస్సును నిర్వహిస్తోంది.

ఈ నినాదాన్ని ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ ప్రశంసించారు. ఉపనిషత్తుల్లోని సారాంశం ఇదేనని వ్యాఖ్యానించారు. జీ20 సదస్సులో పాల్గొనే అతిరథులు దిల్లీ విచ్చేస్తున్నారు. తొలుత బ్రిటన్‌ ప్రధాని తన సతీమణి అక్షతా మూర్తితో కలిసి భారత్‌లో అడుగుపెట్టారు. సునాక్‌కు కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే స్వాగతం పలికారు. ‘దిల్లీలో దిగా. ప్రపంచ నేతలతో సమావేశమై ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తా. కలిసి పరిష్కారం కనుగొంటాం’ అని సునాక్‌ భారత్‌లో అడుగుపెట్టిన అనంతరం ట్వీట్‌ చేశారు. ‘సునాక్‌కు స్వాగతం, ఫలవంతమైన చర్చల్లో భాగస్వాములవుదాం’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. లండన్‌లో బయలుదేరే ముందు రిషి సునాక్‌ అక్కడి మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు వెళ్లడం తనకు చాలా ప్రత్యేకమని తెలిపారు. తనను ‘భారతదేశ అల్లుడు’గా వ్యవహరిస్తుండటాన్ని ఆయన సరదాగా గుర్తు చేసుకున్నారు. ఆప్యాయతతోనే తనను అలా పిలుస్తున్నారని అనుకుంటున్నానని చెప్పారు. భారత్‌ తన మనసుకు చాలా దగ్గరి దేశమని వ్యాఖ్యానించారు.

భారత్‌లో అడుగిడిన బైడెన్‌

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ శుక్రవారం సాయంత్రం భారత్‌లో అడుగుపెట్టారు. ఆయన కొవిడ్‌ నిబంధనలను పాటిస్తున్నారు. బైడెన్‌ సతీమణి జిల్‌ బైడెన్‌కు కొవిడ్‌ సోకడంతో ఆయన ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా దిల్లీ చేరుకున్నారు. ప్రపంచ నేతలకు విమానాశ్రయంవద్ద సంప్రదాయ నృత్యాలతో స్వాగతం లభిస్తోంది. ఐఎంఎఫ్‌ అధినేత క్రిస్టాలినా జార్జీవా తనకు స్వాగతం పలికిన వారితో కలిసి డ్యాన్స్‌ చేశారు. ఇటలీ ప్రధాని మెలోనిని కేంద్ర మంత్రి శోభా కరాంద్లజే స్వాగతించారు. అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్‌కు కేంద్ర మంత్రి ఫగన్‌ కులస్థే స్వాగతం పలికారు. ఆఫ్రికన్‌ యూనియన్‌ ఛైర్‌ పర్సన్‌ అజాలీ అస్సౌమనికి ఘన స్వాగతం లభించింది. ఇంకా భారత్‌కు చేరుకున్న వారిలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌, ఒమన్‌ ఉప ప్రధాని ఒమన్‌ సయ్యిద్‌ ఫహద్‌ బిన్‌ మహమ్మద్‌ అల్‌ సయ్యద్‌, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌ బంగా తదితరులున్నారు.

చైనా ప్రధాని రాక

చైనా ప్రధాని లీ కియాంగ్‌, సింగపూర్‌ ప్రధాని లీ సీన్‌ లూంగ్‌, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా ఎల్‌ సిసి, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్‌, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడొ దిల్లీ చేరుకున్నారు.

బంతిపూల వనం

జీ20 సదస్సుకు ముస్తాబైన దిల్లీ బంతిపూల వనంలా మారిపోయింది. ప్రపంచ నేతలు పాల్గొనే మార్గంలో ఉన్న చెట్లకు రంగురంగుల పూలతో చేసిన ఈ అలంకరణ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇలా పర్యావరణ హితంగా రహదారులను అలంకరించడం దిల్లీలో ఇదే మొదటిసారి.

పలు భాషల్లో స్వాగతం

ఫ్రెంచి నుంచి టర్కిష్‌ దాకా పలు భాషల్లో జీ20 అతిథులకు స్వాగతం లభిస్తోంది. జీ20 దేశాలకు చెందిన అన్ని భాషల్లో ‘స్వాగతం’ అని సదస్సు వద్ద ప్రదర్శిస్తున్నారు. సదస్సు వేదిక సమీపంలోని డెలిగేషన్‌ కేంద్రంలో అన్ని భాషల్లో స్వాగతం పలికే ఏర్పాట్లు చేశారు.

డ్రోన్లు, బోట్లు, వేల మంది సిబ్బంది

కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా వలయంలోకి జీ20 సదస్సు జరగనున్న దిల్లీ వెళ్లింది. జీ20 దేశాధినేతలు చేరుకుంటున్న క్రమంలో వాయుసేన, పారా మిలిటరీ, ఎన్‌ఎస్‌జీ బలగాలు దిల్లీని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఆకాశ మార్గంలో యాంటీ డ్రోన్‌ వ్యవస్థతో గస్తీ నిర్వహిస్తున్నారు. 50వేల మందికిపైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ప్రగతి మైదాన్‌ చుట్టూ సుమారు 13 వేల మందితో భద్రత కల్పించారు. సెలవులు ప్రకటించడం, భద్రత కట్టుదిట్టం చేయడం, అనవసరంగా వచ్చే వారిని అనుమతించకపోవడం, వైద్యం తప్ప ఇతర సేవలన్నింటినీ నిలిపి వేయడంతో దిల్లీలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఛేంజ్‌ ఆఫ్‌ గార్డ్‌ కార్యక్రమం యథావిధిగా జరగనుంది.


సదస్సులో చర్చించే ముఖ్యాంశాలు

  • ఆఫ్రికన్‌ యూనియన్‌కు జీ20లో సభ్యత్వం
  • అంతర్జాతీయ రుణ వితరణ పునర్వ్యవస్థీకరణ
  • అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణ వితరణ
  • క్రిప్టో కరెన్సీపై నియంత్రణ వ్యవస్థ
  • ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌

జీ20 అధ్యక్ష పాత్రలో భారత్‌ ప్రతిపాదనలు

  • సమ్మిళిత వృద్ధి
  • డిజిటల్‌ ఆవిష్కరణ
  • వాతావరణ మార్పులు
  • అందరికీ సమాన ఆరోగ్య ఆవకాశం

భారత్‌ ఆహ్వానించిన జీ20 యేతర దేశాలు

బంగ్లాదేశ్‌, ఈజిప్టు, మారిషస్‌, యూఏఈ, స్పెయిన్‌, సింగపూర్‌, ఒమన్‌, నైజీరియా, నెదర్లాండ్స్‌


జీ20 వాటా

  • ప్రపంచ జీడీపీలో జీ20 దేశాల వాటా:   85శాతం
  • ప్రపంచ జనాభాలో జీ20 దేశాల వాటా:  66శాతం
  • ప్రపంచ వాణిజ్యంలో జీ20 వాటా:  75శాతం

జీ20 దేశాలు

భారత్‌, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, కెనడా, చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్‌, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కియే, బ్రిటన్‌, అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని