COVID subvariant JN.1: జేఎన్‌.1తో జాగ్రత్త

కొవిడ్‌ జేఎన్‌.1 వేరియంట్‌ ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

Updated : 19 Dec 2023 08:54 IST

రాష్ట్రాలకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ లేఖ

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌ జేఎన్‌.1 వేరియంట్‌ (COVID subvariant JN.1) ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి సుధాంశ్‌ పంత్‌ సోమవారం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఇటీవల కాలంలో కేరళలాంటి కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు పెరిగాయని, ఇదే సమయంలో కొత్త వేరియంట్‌ ప్రభావం పెరిగిందని పేర్కొన్నారు. అందువల్ల అన్ని ప్రభుత్వాలు తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు.

  • రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వైరస్‌ విస్తరించకుండా అడ్డుకోవడానికి తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలి. శ్వాశకోశ సంబంధ పరిశుభ్రత పాటించేలా చూడాలి.
  • కేంద్ర ప్రభుత్వం ఇదివరకు జారీ చేసిన కొవిడ్‌-19 నియంత్రణ మార్గదర్శకాలను అమలు చేయాలి.
  • జిల్లాల వారీగా ఆసుపత్రులకు వచ్చే ఐఎల్‌ఐ (ఇన్‌ఫ్లుయెంజా లైక్‌ ఇల్‌నెస్‌), సారి (సీవియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ ఇల్‌నెస్‌) రోగులను నిరంతరం పర్యవేక్షించాలి. వారి వివరాలను ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసి కేసుల పెరుగుదలను తొలి దశలోనే పసిగట్టాలి.
  • కొవిడ్‌-19 పరీక్ష మార్గదర్శకాల ప్రకారం.. అన్ని జిల్లాల్లో తగిన పరీక్షలు నిర్వహించాలి. అందులో కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన నిష్పత్తి ప్రకారం ఆర్‌టీపీసీఆర్‌, యాంటీజెన్‌ టెస్టులు నిర్వహించాలి.
  • ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు అధికంగా చేపట్టి పాజిటివ్‌ నమూనాలను జన్యు పరిణామ విశ్లేషణ కోసం ఇన్సాకాగ్‌ లేబొరేటరీలకు పంపి కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించే ప్రయత్నం చేయాలి.
  • కొవిడ్‌-19 నియంత్రణకు ఇదివరకటి మాదిరే సమాజ సహకారం కోరాలి. అందరూ దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకునేలా ప్రోత్సహించాలి.
  • జేఎన్‌.1 వేరియంట్‌ సోకిన వారిలో రోగ లక్షణాలు ఎలా ఉంటాయన్నది ఇంకా పూర్తిగా తెలియదు. సాధారణంగా కొవిడ్‌-19 సోకినప్పుడు కనిపించే లక్షణాలే కనిపించొచ్చు. అయితే ఈ వేరియంట్‌ సోకినప్పుడు ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సంకేతం ఏమీలేదు. దీనివల్ల ప్రజారోగ్యానికి ముప్పు పెరిగే ప్రమాదం ఉందన్న సంకేతం కూడా లేదు. ఇప్పుడున్న లేబొరేటరీల్లో ఆర్‌టీపీసీఆర్‌ టెస్టుల ద్వారా జేఎన్‌.1 వేరియంట్‌ను కనిపెట్టవచ్చు.

    కొవిడ్‌ అప్రమత్తత, ఆసుపత్రుల సన్నద్ధతపై బుధవారం రాష్ట్రాల అధికారులతో కేంద్రం సమీక్ష నిర్వహించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని