గుల్జార్‌, రామభద్రాచార్యలకు జ్ఞానపీఠ్‌

ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్‌, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యలు 2023 సంవత్సరానికి సంబంధించిన 58వ జ్ఞానపీఠ్‌ అవార్డుకు ఎంపికయ్యారు.

Published : 18 Feb 2024 03:08 IST

ఉర్దూ కవి, సంస్కృత పండితునికి దక్కిన గౌరవం

దిల్లీ: ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్‌, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యలు 2023 సంవత్సరానికి సంబంధించిన 58వ జ్ఞానపీఠ్‌ అవార్డుకు ఎంపికయ్యారు. వారిని ఎంపిక చేసినట్లు శనివారం అవార్డు కమిటీ ప్రకటించింది. ‘రెండు భాషల్లో ప్రముఖ రచయితలైన ఇద్దరికి జ్ఞానపీఠ్‌ ఇవ్వాలని నిర్ణయించాం. సంస్కృత సాహితీవేత్త జగద్గురు రామభద్రాచార్య, ఉర్దూ కవి గుల్జార్‌లను ఈ అవార్డుకు ఎంపిక చేశాం’ అని కమిటీ వివరించింది. 1944లో ఏర్పాటైన జ్ఞానపీఠ్‌ అవార్డును భారతీయ సాహిత్యంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి ఏటా ఇస్తుంటారు. సంస్కృత భాషకు ఈ అవార్డు దక్కడం ఇది రెండోసారి. ఉర్దూకు ఐదోసారి ఈ అవార్డు దక్కింది. అవార్డు కింద రూ.21 లక్షల నగదు, వాగ్దేవి విగ్రహం, ప్రశంసపత్రం అందజేస్తారు. జ్ఞానపీఠ్‌ అవార్డు ఎంపిక కమిటీ ఛైర్మన్‌గా ప్రతిభా రాయ్‌, సభ్యుల్లో తెలుగు జర్నలిస్టు ఎ.కృష్ణారావు ఉన్నారు. 2022లో ఈ అవార్డును గోవా రచయిత దామోదర్‌ మౌజో దక్కించుకున్నారు.


కవిత్వంలో దిట్ట

గుల్జార్‌గా సుప్రసిద్ధుడైన సంపూరన్‌ సింగ్‌ కల్రా (89) హిందీ సినీ సంగీత ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఉర్దూ కవిత్వంలోనూ ఆయన దిట్ట. గుల్జార్‌కు 2002లో సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. 2004లో పద్మభూషణ్‌ అవార్డుతో ఆయనను కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. హిందీ చిత్రసీమలో చేసిన కృషికి గుర్తింపుగా 2013లో ఆయనను దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. 5 జాతీయ చలనచిత్ర అవార్డులను ఆయన దక్కించుకున్నారు. స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌లో ఆయన రాసిన ‘జై హో’ పాటకు 2009లో ఆస్కార్‌ అవార్డు వచ్చింది. 2010లో గ్రామీ అవార్డుకు ఆ పాట ఎంపికైంది. మాచిస్‌ (1996), ఓంకార (2006), దిల్‌ సే (1998), గురు (2007) చిత్రాల్లో ఆయన రాసిన పాటలకు ఎంతో పేరు ప్రఖ్యాతులొచ్చాయి. గుల్జార్‌ దర్శకుడిగానూ రాణించారు. కోషిష్‌ (1972), పరిచయ్‌ (1975), ఇజాజత్‌ (1977) చిత్రాలతోపాటు టీవీ సీరియల్‌ మీర్జా గాలిబ్‌కు (1988) ఆయన దర్శకత్వం వహించారు. సినీ ప్రయాణంతోపాటు సాహిత్యంలోనూ గుల్జార్‌ అనేక మైలురాళ్లను అధిగమించారు. కవితలనూ కొత్త పుంతలు తొక్కించారు. మూడు లైన్లతో పద్యాలను రచించి చరిత్ర సృష్టించారు. ఇప్పటికీ చిన్న పిల్లల కవిత్వంపై ఆయన పని చేస్తున్నారు.


22 భాషల పండితుడు

రామభద్రాచార్య (74) చిత్రకూట్‌లోని తులసీ పీఠ్‌ వ్యవస్థాపకుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన హిందూ ఆధ్యాత్మిక గురువుగానూ గుర్తింపు పొందారు. విద్యావేత్త, రచయితగానూ సుప్రసిద్ధుడు. 240 వరకూ పుస్తకాలు, ఇతిహాసాలను రచించారు. ప్రస్తుతమున్న నలుగురు జగద్గురువులైన రామభద్రాచార్యల్లో ఆయన ఒకరు. 1982 నుంచి ఆయన ఈ హోదాలో ఉన్నారు. ఆయన 22 భాషల్లో పండితుడు. సంస్కృతం, హిందీ, అవధీ, మైథిలీ తదితర పలు భాషల్లో రచనలు చేశారు. 2015లో ఆయనకు పద్మ విభూషణ్‌ పురస్కారం దక్కింది. రామభద్రాచార్య అసలు పేరు గిరిధర మిశ్ర. 2 నెలల వయసులో ఉన్నప్పుడు ఆయన ట్రకోమావల్ల కంటి చూపును కోల్పోయారు. దీంతో తాతవద్దే ఆయన ఓనమాలు దిద్దారు. ఐదేళ్ల వయసు వచ్చే నాటికే భగవద్గీత మొత్తాన్ని గుర్తు పెట్టుకోగలిగే స్థాయికి చేరుకున్నారు. 8ఏళ్ల వయసు నాటికి రామచరిత మానస్‌ మొత్తాన్ని నేర్చుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని