ముడత మంచిదే!

పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్‌) సిబ్బంది ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.

Updated : 09 May 2024 05:51 IST

ఇస్త్రీ చేయని దుస్తులతో భూతాపంపై పోరు 
ఐఐటీ ప్రొఫెసర్‌ వినూత్న ప్రతిపాదన

దిల్లీ: పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్‌) సిబ్బంది ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ‘రింకల్స్‌ అచ్చే హై’ (వాహ్‌ మండే) పేరుతో ప్రతి సోమవారం ఇస్త్రీ చేయని, ముడతలు పడిన దుస్తులను ధరించాలని వారు నిర్ణయించారు. దీని ద్వారా ప్రస్తుతం 1.25 లక్షల కిలోల కర్బన ఉద్గారాలను అడ్డుకుంటున్నట్లు బాంబే ఐఐటీకి చెందిన ప్రొఫెసర్‌ చేతన్‌ సింగ్‌ సోలంకీ తెలిపారు. అయితే సోమవారం రోజున ఇస్త్రీ చేసిన దుస్తులు ధరించవద్దని దేశవ్యాప్తంగా ఉన్న తమ ల్యాబ్‌ల్లోని సిబ్బందికి సూచిస్తూ అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని సీఎస్‌ఐఆర్‌ ప్రధాన కార్యాలయం పేర్కొంది. ‘‘గత నెల 23న ధరిత్రీ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్‌ చేతన్‌ సోలంకీ సీఎస్‌ఐఆర్‌ ప్రధాన కార్యాలయంలో ‘క్లైమేట్‌ క్లాక్‌’ను ఏర్పాటు చేశారు. అనంతరం చేసిన ప్రసంగంలో ఆయన ‘రింకల్స్‌ అచ్చే హై’ ఆలోచనను ప్రతిపాదించారు’’ అని తెలిపింది. ఇంధనాన్ని ఆదా చేస్తూ, పర్యావరణాన్ని రక్షించడం, వాతావరణ మార్పులపై అవగాహనను పెంచడం ‘రింకల్స్‌ అచ్చే హై’ కార్యక్రమ ఉద్దేశం. ‘‘వాతావరణ మార్పులపై పోరులో అత్యంత సులువైన పరిష్కార మార్గం.. ‘ఏదో ఒక పనికి స్వస్తి పలకడమే.’ రింకల్స్‌ అచ్చే హై కార్యక్రమం ఊపందుకుంటోంది. దీనికింద ప్రతి సోమవారం.. ఇస్త్రీ చేయని దుస్తులు ధరించాలని ప్రజలను కోరుతున్నాం. ఒక జత దుస్తులను ఇస్త్రీ చేయకపోవడం ద్వారా 200 గ్రాముల కర్బన ఉద్గారాలను అడ్డుకోవచ్చు. లక్షల మంది దీన్ని అనుసరిస్తే భారీగా కర్బన ఉద్గారాలకు కళ్లెం వేయవచ్చు. పైగా అది ఫ్యాషన్‌గా మారుతుంది. ప్రస్తుతం 6.25 లక్షల మంది ప్రతి సోమవారం ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. తద్వారా 1.25 లక్షల కిలోల ఉద్గారాలను అడ్డుకుంటున్నాం. ఈ ఏడాది చివరినాటికి కోటి మందికిపైగా ఈ ఉద్యమంలో భాగస్వాములవుతారని ఆశిస్తున్నా’’ అని సోలంకీ తెలిపారు. దేశవ్యాప్తంగా తమ ల్యాబ్‌లన్నింటిలో 10 శాతం మేర విద్యుత్‌ను పొదుపు చేయాలనుకుంటున్నట్లు సీఎస్‌ఐఆర్‌ అధికారి ఒకరు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని