Sidhu Moosewalas: ఎవరీ గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌..!

 ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య తమ పనే అని కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ ప్రకటించాడు. లారెన్స్‌ బిష్ణోయ్‌

Updated : 30 May 2022 15:29 IST

సిద్ధూ మూసేవాలా హత్యతో వార్తల్లోకి 

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య తమ పనే అని కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ ప్రకటించాడు. లారెన్స్‌ బిష్ణోయ్‌ అనే మరోగ్యాంగ్‌స్టర్‌తో కలిసి తాము ఈ కుట్రకు తుదిరూపు ఇచ్చినట్లు పేర్కొన్నాడు. విక్కీ మిద్ధూఖేడా, గుర్‌లాల్‌ బ్రార్ హత్యకేసుల్లో సిద్ధూ పేరు బయటకు రావడంతో ప్రతికారంగా చేసినట్లు వెల్లడించారు. 

గతంలో ఏం జరిగింది‌..?

గోల్డీబ్రార్‌ అసలు పేరు సతీందర్‌ సింగ్‌. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ ఇతడి సొంత జిల్లా. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌కు అత్యంత సన్నిహితుడు. పంజాబ్‌లో వసూళ్ల దందాను వీరు నడుపుతుంటారు. గతంలో యూత్‌ కాంగ్రెస్‌ నేత గురులాల్‌ పహల్వాన్‌ హత్యకేసులో కూడా అతడి పేరు బయటకు వచ్చింది. ప్రస్తుతం గోల్డీ కెనడాలో నివసిస్తున్నాడు. 

దేశ రాజధాని దిల్లీ, పంజాబ్‌, హరియాణాల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాడు. మరోపక్క బిష్ణోయ్‌ తరపున గోల్డీబ్రార్‌ వసూళ్ల దందాను ఈ ప్రాంతంలో నడుపుతున్నాడు. ఇక్కడ లారెన్స్‌కు మరో గ్యాంగ్‌ స్టర్‌ దవిందర్‌ బంభిహాకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. బంభిహా గ్యాంగ్‌ను అర్మేనియా జైల్లో ఉన్న లక్కీ పటేల్‌ నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా పంజాబ్‌లో  ఇరు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడుతున్నాయి.  

మూసేవాలా కేసులో..

పంజాబ్‌ పోలీస్‌ డీజీపీ వీకే భావ్రా కథనం ప్రకారం మూసేవాలా హత్యకు.. ఎస్‌ఏడీ నాయకుడు విక్కీ మిద్ధూఖేడా  హత్యకు సంబంధం ఉంది. మిద్ధూఖేడా హత్యకు ప్రతికారంగానే ఇది చోటుచేసుకొంది. ఈ హత్యకు బంభిహా గ్యాంగ్‌ గతంలో బాధ్యత తీసుకొంది. గతేడాది జులైలో గోల్డీబ్రార్‌ కజిన్‌ గురులాల్‌ బ్రార్‌ కూడా హత్యకు గురయ్యాడు. ఇతడు లారెన్స్‌కు అత్యంత సన్నిహితుడు. దీనికి ప్రతీకారంగా అప్పట్లో కాంగ్రెస్‌ నేత గురులాల్‌ పహిల్వాన్‌ను బిష్ణోయ్‌ గ్యాంగ్‌ హత్య చేసింది. ఈ కేసులో కీలక నిందితుడైన గోల్డీబ్రార్‌ కెనడాకు పారిపోయాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని