Row over Bills: బిల్లులు వెనక్కి పంపిన గవర్నర్‌.. మళ్లీ తీర్మానానికి సిద్ధమైన స్టాలిన్‌ ప్రభుత్వం

అసెంబ్లీ తీర్మానించి పంపించిన అనేక బిల్లులను తమిళనాడు గవర్నర్‌ తిరిగి వెనక్కి పంపించారు. ఈ నేపథ్యంలో మరోసారి వాటిని ఆమోదించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.

Published : 16 Nov 2023 17:26 IST

చెన్నై: అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను గవర్నర్‌ ఆమోదించడంలో జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై భారత సర్వోన్నత న్యాయస్థానాన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమోదం కోసం వచ్చిన పలు బిల్లులను గవర్నర్‌ తిరిగి వెనక్కి పంపించారు. దీంతో వీటిపై మరోసారి తీర్మానం చేసి పంపించేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం నవంబర్‌ 18న అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచనుంది.

‘అసెంబ్లీ తీర్మానించి పంపిన అనేక బిల్లులను గవర్నర్‌ తిరిగి పంపినట్లు తెలిసింది. వీటిపై మళ్లీ తీర్మానం చేసేందుకు శనివారం నాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది’ అని స్పీకర్‌ ఎం అప్పవూ వెల్లడించారు. తిరిగి పంపిన బిల్లులను వెంటనే ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోందని.. అందుకే ఈ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. మరోవైపు గవర్నర్‌ వద్ద ఇటువంటివి 12 బిల్లులు పెండింగులో ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే, వీటిలో ఎన్ని బిల్లులను గవర్నర్‌ తిప్పి పంపారో అనే విషయంపై స్పష్టత లేదు. గత అక్టోబర్‌ నెలలో తమిళనాడు అసెంబ్లీ నిరవదిక వాయిదా పడింది.

గవర్నర్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి

ఇదిలాఉంటే, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్‌ జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అటు పంజాబ్‌ ప్రభుత్వం కూడా ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. విచారించిన సుప్రీం ధర్మాసనం.. గవర్నర్‌లు ఇలా వ్యవహరించడం ఆందోళనకరమైన అంశమని అభిప్రాయపడింది. 12 బిల్లుల పెండింగుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలపై ప్రతిస్పందన తెలపాలని నవంబర్‌ 10న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే గవర్నర్‌ ఆ బిల్లులను వెనక్కి పంపడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని