దుబాయ్ పర్యటనలో గురుదేవ్‌.. కాప్-28 సదస్సులో ప్రసంగించనున్న శ్రీశ్రీ రవిశంకర్

కాప్‌-28 సదస్సులో పాల్గొనేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుదేవ్‌ శ్రీశ్రీ రవిశంకర్‌ దుబాయి వెళ్లారు. వారం రోజుల పాటు ఆయన అరబ్‌ దేశాల్లో పర్యటించనున్నారు.

Published : 07 Dec 2023 22:52 IST

బెంగుళూరు: ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ వారం రోజుల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకున్నారు. ఎమిరేట్స్ సారథ్యంలో వ్యూహాత్మక సంభాషణలు సహా వాతావరణ మార్పులపై చర్చించే కాప్ -28 సదస్సులో ఉన్నత స్థాయి చర్చల్లో శ్రీశ్రీ పాల్గొననున్నారు. శాంతి స్థాపన, సంక్షోభ నివారణ, సమస్యల పరిష్కారం, పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిక్షణ తదితర అంశాల్లో ఆయన విశేష కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ​పర్యటనలో భాగంగా గురుదేవ్‌ తొలుత యూఏఈ నగరమైన ఫుజైరా పాలకుడు, సుప్రీం కౌన్సిల్ సభ్యుడైన షేక్ హమద్ బిన్ మొహమ్మద్ అల్ షర్కీతో సమావేశమయ్యారు. ధర్మబద్ధమైన మానవ విలువల్ని పెంపొందించడం, శాంతియుత సహజీవన ఆవశ్యకత సహా విస్తృతమైన అంశాలపై ఆయనతో చర్చించారు. ​భారతదేశంలోని 70 నదులు, ఉపనదుల పునరుద్ధరణ, పునరుజ్జీవనానికి 36 దేశాల్లో 8కోట్ల 12 లక్షల మొక్కలు నాటేందుకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తిగా, 22లక్షల మంది రైతులను స్థిరమైన, పర్యావరణ అనుకూలమైన, సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా చేసిన వ్యక్తిగా గురుదేవ్‌ తన అభిప్రాయాలను కాప్‌ 28 సమావేశాల్లో పంచుకోనున్నారు. ధార్మిక విశ్వాసాలను పాటించే సమాజాలను భూ పరిరక్షణకు ఎలా సమీకరించాలనే అంశంపై శ్రీశ్రీ ప్రసంగిస్తారు. బ్రహ్మకుమారీస్‌ మోరీన్ గుడ్‌మాన్ వరల్డ్ విజన్ ఇంటర్నేషనల్‌కు చెందిన యుకికో యమదా మోరోవిక్ వంటి ఇతర ధార్మిక నాయకులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 

ఐరాస పర్యావరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం గురుదేవ్‌ కీలకోపన్యాసం చేయనున్నారు. పర్యావరణ హితమైన, సుస్థిరమైన జీవనశైలిని పెంపొందించేందుకు, మానవ కార్యకలాపాలకు పర్యావరణానికి మధ్య సమతుల్యాన్ని సాధించేందుకు మొదట మనలో రావాల్సిన అంతర్గత పరివర్తన ప్రాముఖ్యతను వివరించనున్నారు. అనంతరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ వార్షిక అంతర్జాతీయ సదస్సులో ఎమిరేట్స్ దేశపు సహన, పరస్పర సహజీవన శాఖా మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, ఇతర ప్రముఖులతో కలసి గురుదేవ్ గౌరవ అతిథిగా హాజరవుతారు. ​కాప్ 28 పర్యావరణ సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాలలో భాగంగా గురుదేవ్ పాల్గొననున్నారు. కొలంబియా ప్రభుత్వం, ఫార్క్ వేర్పాటువాదుల మధ్య 52 ఏళ్లపాటు కొనసాగిన వివాదానికి ముగింపు పలికేందుకు దౌత్యం, చర్చల ద్వారా ఏకాభిప్రాయ నిర్మాణానికి 2015లో జరిపిన చర్చలు, వాటి ఫలితాలను సభ్యులతో ఆయన పంచుకోనున్నారు. ప్రపంచ శాంతి, సామరస్యం కావాలంటే మొదటగా వ్యక్తిగతమైన ప్రశాంతత కావాలని గురుదేవ్ అంటారు. అందుకనుగుణంగా అరబ్‌ దేశాల పర్యటనలో చివరగా గురుదేవ్ దుబాయ్‌లోని అల్ నాసర్ క్లబ్ - అల్ మక్టూమ్ స్టేడియంలో 15,000 మందికి పైగా ప్రజలతో ధ్యానం చేయించనున్నారు. అరబ్‌ దేశాలలో అభివృద్ధికి కృషిచేసిన వితరణశీలురైన వ్యాపారవేత్తలు, సంఘ సేవకులను సన్మానిస్తున్న ఈ కార్యక్రమానికి రిజర్వు చేసిన టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని