Shiv Sena: శివసేనకు తిరుగుబాట్ల దెబ్బ.. 56ఏళ్లలో నాలుగోసారి..!

56ఏళ్ల ప్రస్థానంలో పార్టీ అసమ్మతి నేతల నుంచి తిరుగుబాట్లు ఎదుర్కోవడం శివసేనకు ఇది నాలుగోసారి.

Published : 23 Jun 2022 01:37 IST

అధికారంలో ఉండగా అతిపెద్ద ఎదురుదెబ్బ

ముంబయి: మరాఠీల హక్కుల కోసం మొదలై.. హిందుత్వ ఎజెండాను ఎత్తుకున్న శివసేన (Shiv Sena) మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. క్రితం ఎన్నికల్లో భాజపాకు దూరమై.. విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన కాంగ్రెస్‌, ఎన్‌సీపీతో చేయికలిపి సంకీర్ణ (MVA) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చివరకు శివసైనికుల తిరుగుబాటుతో (Revolt) అధికారాన్ని కోల్పోయేందుకు సిద్ధంగా ఉన్న శివసేనకు ఈ తిరుగుబాట్లు కొత్తేమీ కాదు. 56 ఏళ్ల ప్రస్థానంలో పార్టీ అసమ్మతి నేతల నుంచి తిరుగుబాట్లు ఎదుర్కోవడం శివసేనకు ఇది నాలుగోసారి. అయితే, గతంలో మూడుసార్లు పార్టీలో ఇటువంటివి చూసినప్పటికీ.. ఈసారి మాత్రం అధికారంలో ఉండగా నాయకత్వంపై ఎదురుతిరగడం పార్టీ చరిత్రలో అతిపెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో మూడుసార్లు శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే (Bal Thackeray) ఉన్నప్పుడు చోటుచేసుకోగా.. ప్రస్తుతం మాత్రం ఆయన కుమారుడు ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) అధికారంలో ఉన్న సయమంలో నాలుగోది చోటుచేసుకుంది.

1991లో తొలిసారి..

ముంబయి వంటి మహానగరంలో కీలక శక్తిగా ఎదిగిన శివసేనకు.. 1991లో తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలో గ్రామీణ ప్రాంతాలకు పార్టీ విస్తరించడంలో కీలకంగా వ్యవహరించిన ఓబీసీ నేత ఛగన్‌ భుజ్బల్‌ శివసేనను వీడడం పెద్ద నష్టాన్నే కలిగించింది. పార్టీ నాయకత్వం తనకు తగినంత గుర్తింపు ఇవ్వడం లేదనే కారణాన్ని చెప్పిన ఆయన.. చాలా సీట్లు గెలిచేందుకు కృషి చేసినప్పటికీ ప్రతిపక్ష నేతగా మనోహర్‌ జోషిని బాల్‌ఠాక్రే నియమించడం ఆయన అసంతృప్తికి కారణమయ్యింది. దాంతో 18 మంది శివసేన ఎమ్మెల్యేలతో కలిసి పార్టీని వీడుతున్నట్లు వెల్లడించిన భుజ్బల్‌.. కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే, అలా ప్రకటించిన రోజే 12 మంది రెబల్‌ ఎమ్మెల్యేలు సొంతగూటికి (శివసేనకు) చేరుకున్నారు. అయితే, భుజ్బల్‌తోపాటు ఇతర రెబల్‌ నేతలను ప్రత్యేక గ్రూపుగా గుర్తించిన స్పీకర్‌.. వారిపై ఎటువంటి చర్య తీసుకోలేదు. అనంతరం ఆయన శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీలో చేరిపోయారు. ప్రస్తుతం 74ఏళ్ల భుజ్బల్‌ ఇప్పటి సంకీర్ణ ప్రభుత్వంలోనూ మంత్రిగా కొనసాగుతుండడం విశేషం.

నారాయణ్‌ రాణె రూపంలో..

శివసేన ఇటువంటి సవాల్‌ను 2005లోనూ చవిచూసింది. మాజీ ముఖ్యమంత్రి నారాయణ్‌ రాణె పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిపోయారు. అనంతరం కాంగ్రెస్‌కూ రాజీనామా చేసి భాజపాలో చేరారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాణె కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. కీలక నేత పార్టీని వీడడం శివసేనకు కాస్త ఇబ్బంది కలిగించింది.

షాకిచ్చిన రాజ్‌ఠాక్రే..

ఇక 2006లోనూ శివసేనకు మరో షాక్‌ తగిలింది. ఉద్ధవ్‌ ఠాక్రే సోదరుడు రాజ్‌ఠాక్రే శివసేనను వీడాలని నిర్ణయించుకోవడం పార్టీని మరోసారి దెబ్బతీసింది. శివసేనను వీడిన రాజ్‌ఠాక్రే మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్‌ సేన (MNS) పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అయితే, తన పోరాటం శివసేన నాయకత్వం మీద కాదని.. ఇతరులను రానివ్వకుండా అడ్డుకుంటున్న కొందరిపైనేనని పార్టీని వీడుతున్న సమయంలో రాజ్‌ఠాక్రే చెప్పుకొచ్చారు. అనంతరం 2009లో జరిగిన ఎన్నికల్లో రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్‌ఎస్‌ 13 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. ఆ సమయంలో శివసేన కంటే ఒకస్థానం అధికంగా గెలుపొందింది.

ఇప్పుడు ఏక్‌నాథ్‌..

తాజాగా ఏక్‌నాథ్‌ శిందే రూపంలో మరోసారి తిరుగుబాటును ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. అయితే, తమకు శివసేన నాయకత్వంపై ఎటువంటి వ్యతిరేకత లేదని.. కేవలం సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్‌, ఎన్‌సీపీల తీరువల్లే రెబల్స్‌గా మారాల్సి వచ్చిందని చెబుతున్నారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేల బలం ఉందని శిందే క్యాంప్‌ చెబుతోంది. మహావికాస్‌ అఘాడీ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ పార్టీ అసంతృప్త నేతలతో శివసేనకు అధికారాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేనకు 55, ఎన్‌సీపీకి 53, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష భాజపాకు మాత్రం అసెంబ్లీలో 106 సభ్యుల బలం ఉంది. అయితే, తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్‌ శిందేపై అనర్హత వేటు పడకుండా ఉండాలంటే ఆయనకు 37మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్‌నాథ్‌ శిందేను గుర్తించాలని కోరుతూ 34 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌కు లేఖ రాశారు. ఇలా పలు సందర్భాల్లో ఆటుపోట్లను ఎదుర్కొన్న శివసేనకు ఈసారి ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు