viral video: నాందేడ్ ఆస్పత్రి డీన్‌తో మరుగుదొడ్లు శుభ్రం చేయించిన ఎంపీ!

శివసేన (Shiv Sena) ఎంపీ హేమంత్‌ పాటిల్‌ (Hemant Patil) నాందేడ్‌ ప్రభుత్వ ఆస్పత్రి డీన్‌తో మరుగుదొడ్లు శుభ్రం చేయించిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 03 Oct 2023 17:28 IST

Image: Saketrai2000

ముంబయి: గత 48 గంటల్లోనే 31 మరణాలు చోటు చేసుకోవడంతో మహారాష్ట్రలోని (Maharashtra) నాందేడ్‌ ప్రభుత్వ ఆస్పత్రి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. దాంతో ఏక్‌నాథ్‌ శిందే సారథ్యంలోని శివసేన-భాజపా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో శివసేన (Shiv Sena) ఎంపీ హేమంత్‌ పాటిల్‌ (Hemant Patil) మరణాలు సంభవించిన శంకర్రావ్‌ చవాన్‌ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ క్రమంలో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నట్లు ఆయన గుర్తించారు. వెంటనే ఆస్పత్రి డీన్‌ శ్యామ్‌రావ్ వాకోడేను పిలిపించి అపరిశుభ్రతపై గట్టిగా నిలదీశారు. అంతటితో ఆగకుండా డీన్‌తోనే మరుగుదొడ్లను శుభ్రం చేయించారు. 

ఆస్పత్రి డీన్‌తో ఎంపీ మరుగుదొడ్లు కడిగిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎంపీ పైపుతో గోడలపై నీళ్లు కొడుతుండగా.. డీన్‌ వైపర్‌తో మరుగుదొడ్లను శుభ్రం చేస్తూ అందులో కనిపించారు. సోమవారం ఇదే ఆస్పత్రిలో 24 గంటల్లోనే 24 మరణాలు సంభవించాయి. మంగళవారానికి ఆ సంఖ్య 31కి  చేరింది. ఇంకా 71 మంది రోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. ఆస్పత్రి డీన్ శామ్‌రావ్‌ సోమవారం మాట్లాడుతూ మరణాలు చోటు చేసుకోవడానికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, మందుల కొరత కారణం కాదని చెప్పారు. రోగులకు సరైన వైద్యం అందించినా వారు కోలుకోలేదని తెలిపారు. 

ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యధిక మరణాలు చోటు చేసుకోవడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ‘ప్రచారం కోసం భాజపా ప్రభుత్వం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ, చిన్నారుల కోసం ఔషధాలు కొనుగోలు చేయడానికి మాత్రం డబ్బుల్లేవని’ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్‌లో పోస్టు పెట్టారు. ఇదే అంశంపై కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం పోస్టు పెట్టారు. గతంతో థానే ఆస్పత్రిలోనూ 18 మంది రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుర్తు చేస్తూ విచారం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని