Afghanistan: అఫ్గాన్‌ పౌరుల కోసం భారత్‌ ‘ఎమర్జెన్సీ వీసాలు’

తాలిబన్ల ఆక్రమణతో అఫ్గానిస్థాన్‌లో కల్లోలం నెలకొన్న నేపథ్యంలో ఆ దేశ పౌరుల కోసం భారత్‌ కొత్త వీసా కేటగిరీని ఏర్పాటు చేసింది. అఫ్గాన్ల దరఖాస్తులను వేగంగా

Updated : 17 Aug 2021 12:17 IST

దిల్లీ: తాలిబన్ల ఆక్రమణతో అఫ్గానిస్థాన్‌లో కల్లోలం నెలకొన్న నేపథ్యంలో ఆ దేశ పౌరుల కోసం భారత్‌ కొత్త వీసా కేటగిరీని ఏర్పాటు చేసింది. అఫ్గాన్ల దరఖాస్తులను వేగంగా పరిశీలించేందుకు ఈ-ఎమర్జెన్సీ వీసాలను ప్రకటించింది. ‘‘అఫ్గాన్‌ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీసా నిబంధనలపై కేంద్ర హోంశాఖ సమీక్ష చేపట్టి వీసా నిబంధనల్లో మార్పులు చేసింది. భారత్‌కు వచ్చేందుకు అఫ్గాన్లు చేసుకున్న వీసా దరఖాస్తుల ఫాస్ట్‌ట్రాక్ పరిశీలన కోసం e-Emergency X-Misc Visa పేరుతో ప్రత్యేక కేటగిరీ ఎలక్ట్రానిక్‌ వీసాలను ప్రవేశపెట్టింది’’ అని హోంశాఖ అధికార ప్రతినిధి ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

అఫ్గాన్‌లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కాబుల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ఎమర్జెన్సీ ఎలక్ట్రానిక్‌ వీసాలను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఈ కొత్త కేటగిరీతో ఎలాంటి మతపరమైన ప్రాధాన్యత లేకుండా అఫ్గాన్‌లోని ప్రతి ఒక్కరు వీసాకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు సమాచారం. తొలుత ఆరు నెలల కాల పరిమితితో ఈ వీసాలు మంజూరు చేయనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా దరఖాస్తుదారుల వ్యక్తిగత వివరాలను నిశితంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు కావాల్సిన పత్రాలను త్వరలోనే పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయనున్నట్లు సమాచారం.

ఎంబసీ మూసివేయడంతో కాబుల్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయ అధికారులు, సిబ్బందిని స్వదేశానికి తరలిస్తున్నారు. ఇక ఆ దేశంలో చిక్కుకుపోయిన భారత పౌరులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారిని కూడా వెనక్కి రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని