UNSC: ఐరాస వేదికగా పాక్‌ దారుణ రికార్డును బయటపెట్టిన భారత్

2008లో జరిగిన ముంబయి ఉగ్రదాడి నిందితులకు పాకిస్థాన్‌ మద్దతు అందుతూనే ఉందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)లో భారత్ ఆగ్రహం వ్యక్తం వేసింది.

Updated : 26 Jan 2022 12:44 IST

దిల్లీ: 2008లో జరిగిన ముంబయి ఉగ్రదాడి నిందితులకు పాకిస్థాన్‌ మద్దతు ఇంకా అందుతూనే ఉందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)లో భారత్ ఆగ్రహం వ్యక్తం వేసింది. అది చాలక ఆ దేశం భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తూ.. ఐరాస వేదికను దుర్వినియోగం చేస్తోందని మండిపడింది.

సాయుధ పోరాటంలో పౌరుల రక్షణ అనే అంశంపై జరిగిన చర్చలో భాగంగా ఐరాసలో దాయాది దేశంపై భారత్‌ విరుచుకుపడింది. ‘ప్రస్తుతం మనం పౌరుల రక్షణపై చర్చిస్తున్నాం. ఇప్పుడు వారికి ఉగ్రవాదుల నుంచి ముప్పు వస్తోంది. 2008లో ముంబయిలో జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రదాడికి సంబంధించిన నిందితులకు వారి దేశం మద్దతు లభిస్తూనే ఉంది’ అని వ్యాఖ్యలు చేసింది. 

‘ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, సహాయం చేయడం, మద్దతు ఇవ్వడంలో పాకిస్థాన్‌ చరిత్ర, దాని విధానం సభ్య దేశాలకు తెలుసు. సాయుధ మూకలకు ఆర్థిక సహాయం చేస్తూ, ఆయుధాలు అందించే దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఐరాస నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్రవాదులకు ఆతిథ్యం ఇస్తున్న దేశంగా దారుణమైన రికార్డును సొంతం చేసుకొంది. అది ఎంతగా ఉందంటే.. ప్రపంచవ్యాప్తంగా చాలా ఉగ్రదాడులు ఏదో ఒకరూపంలో పాక్‌ మూలాల్ని కలిగి ఉన్నాయి’ అంటూ తీవ్రంగా స్పందించింది. 

అలాగే జమ్మూకశ్మీర్ అంశంపై మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేసింది. అలాగే పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాలు కూడా తనలో భాగమేనని, వాటిని వెంటనే ఖాళీ చేయాలని తేల్చి చెప్పింది. తాము పొరుగు దేశాలతో మెరుగైన సంబంధాలు కోరుకుంటామని ఈ సందర్భంగా తన వైఖరిని భారత్‌ వెల్లడించింది. గతంలో జరిగిన ఒప్పందాలకు అనుగుణంగా రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నామంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని