సుదీర్ఘంగా భారత్‌-చైనా పదో విడత చర్చలు

భారత్‌, చైనా మిలిటరీ అధికారుల మధ్య పదో విడత సీనియర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు ఆదివారం ముగిశాయి. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న దెస్పాంగ్‌, గోగ్రా సహా ఇతర ఎత్తైన ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణే ప్రధాన

Published : 21 Feb 2021 10:17 IST

దిల్లీ: భారత్‌, చైనా మధ్య పదో విడత కోర్‌‌ కమాండర్‌ స్థాయి చర్చలు ఆదివారం ముగిశాయి. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న దెప్సాంగ్‌, గోగ్రాహైట్స్‌, హాట్‌స్ప్రింగ్స్‌ వద్ద బలగాల ఉపసంహరణే ప్రధాన అజెండాగా ఈ చర్చలు జరిగినట్లు పీటీఐ పేర్కొంది.  

చైనా భూభాగంలోని మాల్దో స్థావరంలో శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పదో విడత చర్చలు ఆదివారం తెల్లవారుజామున 2గంటల వరకు కొనసాగాయి. దాదాపు 16 గంటలసేపు ఇరు దేశాల కోరు కమాండర్ల మధ్య చర్చలు జరిగాయి. భారత్‌ తరపున లెఫ్టినెంట్‌ జనరల్‌ పీజీకే మీనన్‌, చైనా తరపున ల్యూ లిన్‌ నేతృత్వంలో చర్చలు జరిగాయి. ఇరుదేశాల సరిహద్దుల్లోని దెప్సాంగ్‌‌, హాట్‌ స్ప్రింగ్స్‌, గోగ్రా హైట్స్‌ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణే ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.  కాగా ఇప్పటికే శుక్రవారం పాంగాంగ్‌ సరస్సుకు ఇరువైపులా భారత్‌, చైనాల బలగాల ఉపసంహరణ పూర్తైన విషయం తెలిసిందే. 

భారత్‌-చైనా సరిహద్దుల్లో పాంగాగ్‌ సరస్సు వద్ద తొమ్మిది నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ వివాదానికి తెరదించుతూ చైనా రక్షణ శాఖ కొన్నాళ్ల కిందట కీలక ప్రకటన చేసింది. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి భారత్‌-చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభించినట్లు దానిలో పేర్కొంది. ఆ తర్వాత దాన్ని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పార్లమెంట్‌లో‌ ధ్రువీకరించారు. మాస్కోలో జరిగిన ఇరుదేశాల విదేశంగమంత్రుల సమావేశం, ఇటీవల జరిగిన తొమ్మిదో రౌండ్‌ కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చల ఫలితంగా ఈ నిర్ణయం వెలువడినట్లు చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ పేర్కొన్నారు.  
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని