
India Corona: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు... అయినా 3 లక్షల పైనే!
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉద్దృతి కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు మూడు లక్షలపైనే కొత్త కేసులు వెలుగుచూశాయి. అయితే శుక్రవారంతో పోలిస్తే కొత్త కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 19 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,37,704 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 17.22 శాతంగా ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకలో 48 వేల మందికి కరోనా సోకగా.. కేరళలో ఆ సంఖ్య 41 వేలుగా ఉంది. దేశ రాజధాని దిల్లీలో మాత్రం కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అక్కడ 10వేల మంది వైరస్ బారినపడ్డారు. 488 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. రెండేళ్ల వ్యవధిలో 3.89 కోట్ల మందికి కరోనా సోకగా.. 4,88,884 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10 వేల మార్కు దాటింది. వాస్తవంలో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని, ఈ వేరియంటే దేశంలో మూడో వేవ్‌కు కారణమని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 21 లక్షలు దాటాయి. ఆ కేసుల రేటు 5.43 శాతానికి పెరిగింది. తాజాగా మరో 2,42,676 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తంగా 3.6 కోట్ల మంది కరోనా నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 93.31 శాతానికి చేరింది. మరోవైపు శుక్రవారం దేశవ్యాప్తంగా 67 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు 161 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సువారిలో నాలుగు కోట్ల మందికిపైగా టీకా తొలి డోసు స్వీకరించారు. 74.5 లక్షల ప్రికాషనరీ డోసులు పంపిణీ అయ్యాయి.