Vaccine: వ్యాక్సిన్‌ పాస్‌పోర్ట్‌.. వివక్షాపూరితం!

మనదేశంలో ఇప్పటి వరకు కేవలం మూడు శాతం మందికి మాత్రమే కరోనా టీకాలు అందిన నేపథ్యంలో ‘వ్యాక్సిన్‌ పాస్‌పోర్ట్‌’ ప్రతిపాదనను జీ-7 దేశాల ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశంలో భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది.

Published : 05 Jun 2021 18:38 IST

జీ-7 సదస్సులో స్పష్టం చేసిన భారత్‌

దిల్లీ:  మనదేశంలో ఇప్పటి వరకు కేవలం మూడు శాతం మందికి మాత్రమే కరోనా టీకాలు అందిన నేపథ్యంలో ‘వ్యాక్సిన్‌ పాస్‌పోర్ట్‌’ ప్రతిపాదనను జీ-7 దేశాల ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశంలో భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. జీ-7 దేశాల సదస్సుకు భారత్‌ను ఈసారి అతిథి హోదాలో ఆహ్వానించారు. భారత్‌ తరఫున కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ అందులో పాల్గొని మాట్లాడారు. వ్యాక్సిన్ల కొరతతో పాటు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నెమ్మదిగా సాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వంటి ఇబ్బందుల్ని ఆయన లేవనెత్తారు.

అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలా తక్కువ మందికి టీకాలు అందినట్లు హర్షవర్ధన్ గుర్తుచేశారు. అలాగే అందరికీ టీకాలు అందించడం, టీకా పంపిణీ, సరఫరా, రవాణా, వ్యాక్సిన్ల సామర్థ్యం వంటి అంశాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. అందువల్ల వ్యాక్సిన్‌ పాస్‌పోర్ట్‌ విధానాన్ని అమలు చేయడమంటే అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల వివక్ష చూపించడమేనని ఆయన స్పష్టం చేశారు.

రాబోయే మహమ్మారులను ఎదుర్కొనే విషయంలో అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని జీ-7 దేశాలు నిర్ణయించాయి. అయితే పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు టీకాలు అందించే విషయంపై ఈ సదస్సులో ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడం గమనార్హం. కొవిడ్‌-19ను ఎదుర్కొనే వ్యాక్సిన్లు సహా ఇతర ఔషధాల సామర్థ్యంపై నిర్వహించే క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాక్సిన్లు సమానంగా అందడం లేదనే సమస్యకు మాత్రం జీ-7 సదస్సు ఎలాంటి పరిష్కారం చూపలేకపోయింది. వీలైనంత త్వరగా వ్యాక్సిన్లు పంపిణీ చేసేందుకు కృషి చేద్దామంటూ చేతులు దులిపేసుకుంది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించాలంటే భవిష్యత్తులో వ్యాక్సిన్‌ పాస్‌పోర్టు విధానాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదన ఉంది. వ్యాక్సిన్‌ వేసుకున్నట్లుగా ఓ ధ్రువపత్రం లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన యాప్‌లో ఉన్న ఆధారంతో విదేశీయుల్ని దేశంలోకి అనుమతించే విధానమే ‘వ్యాక్సిన్‌ పాస్‌పోర్ట్‌’. దీన్ని అమలులోకి తీసుకురావడంపై వివిధ దేశాలు సమాలోచనలు చేస్తున్నాయి. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటి వరకు చాలామంది టీకాలు తీసుకున్నారు. వ్యాక్సిన్లు తయారీ దశలో ఉండగానే ఆయా దేశాలు టీకాలను భారీ ఎత్తున కొనుగోలు చేయడం వల్లే ఇది సాధ్యపడింది. కానీ పేద-మధ్యాదాయ దేశాల్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. భారత్‌ వంటి భారీ జనాభా కలిగిన దేశాల్లో ఇప్పటి వరకు 3 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇచ్చారు. మరోవైపు అనేక ఆఫ్రికా దేశాలకు ఇంకా టీకాలు అందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏకపక్షంగా వ్యాక్సిన్‌ పాస్‌పోర్ట్‌ విధానాన్ని అమలు చేయడం వల్ల కొన్ని దేశాలపై వివక్ష చూపినట్లవుతుందని భారత్‌ స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని