Cybercrime: సైబర్‌ నేరాల్లో రష్యా టాప్‌.. 10వ స్థానంలో భారత్‌!

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సైబర్‌ నేరాలు చోటుచేసుకుంటున్న తొలి పది దేశాల్లో భారత్‌ ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.

Published : 11 Apr 2024 22:29 IST

దిల్లీ: దేశంలో ఇటీవల సైబర్‌ నేరాల సంఖ్య భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఈ తరహా నేరాలు చోటుచేసుకుంటున్న తొలి పది దేశాల్లో భారత్‌ ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. మన దేశంలో అత్యధికంగా నమోదవుతున్న మోసాల్లో ముందస్తు ఫీజు చెల్లింపులకు సంబంధించినవే ఉన్నాయని తెలిపింది. ‘వరల్డ్‌ సైబర్‌క్రైం ఇండెక్స్‌’ ఆధారంగా 100 దేశాల్లో జరుగుతోన్న వివిధ సైబర్‌ నేరాల సమాచారాన్ని క్రోడీకరించిన పరిశోధకులు తాజా నివేదిక రూపొందించారు.

సైబర్‌ నేరాలు చోటుచేసుకుంటున్న దేశాల్లో రష్యా మొదటి స్థానంలో ఉంది. ఉక్రెయిన్‌, చైనా, అమెరికా, నైజీరియా, రొమానియాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఉత్తర కొరియా ఏడో స్థానంలో ఉండగా.. బ్రిటన్‌, బ్రెజిల్‌ తదుపరి క్రమంలో ఉన్నాయి. సాంకేతిక సైబర్‌ క్రైమ్‌లకు రష్యా, ఉక్రెయిన్‌లు నిలిచాయి. నైజీరియా నేరస్థులు మాత్రం తక్కువ సాంకేతిక అవసరమైన నేరాల్లోనే నిమగ్నమవుతున్నట్లు తాజా సర్వేలో తేలింది.

భారత్‌లో కనిపిస్తోన్న సైబర్‌ నేరాల్లో సాంకేతికతతో కూడిన, తక్కువ సాంకేతిక కలిగిన నేరాలూ అధికంగానే ఉంటున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. మొత్తంగా మాల్వేర్‌ వంటి సాంకేతిక ఉత్పత్తులు, రాన్సమ్‌వేర్‌తోసహా సైబర్‌ దాడులు, దోపీడీలు, హాకింగ్‌ వంటి సాయంతో సమాచార తస్కరణ, క్రెడిట్‌ కార్డులు, ముందస్తు చెల్లింపులు, వర్చువల్‌ కరెన్సీ వంటి మోసాలు ప్రపంచవ్యాప్తంగా అధికంగా ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని