ఖలిస్థానీ తీవ్రవాదులను ఉపేక్షించడంపై కెనడాకు భారత్‌ తీవ్ర నిరసన

భారత్‌ వ్యతిరేక కార్యకలాపాలను బాహాటంగా నిర్వహిస్తున్న ఖలిస్థానీ వేర్పాటువాదులు, తీవ్రవాదులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వారికి సహకరిస్తున్న కెనడా తీరుపై మన విదేశీ వ్యవహారాల శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. దిల్లీలోని కెనడా డిప్యూటీ హై కమిషనర్‌ స్టీవార్ట్‌ వీలర్‌ను సోమవారం పిలిపించుకుని తీవ్ర నిరసన తెలిపింది.

Published : 30 Apr 2024 04:46 IST

దిల్లీలోని ఆ దేశ దౌత్యాధికారిని పిలిపించి మండిపడిన విదేశీ వ్యవహారాల శాఖ

దిల్లీ: భారత్‌ వ్యతిరేక కార్యకలాపాలను బాహాటంగా నిర్వహిస్తున్న ఖలిస్థానీ వేర్పాటువాదులు, తీవ్రవాదులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వారికి సహకరిస్తున్న కెనడా తీరుపై మన విదేశీ వ్యవహారాల శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. దిల్లీలోని కెనడా డిప్యూటీ హై కమిషనర్‌ స్టీవార్ట్‌ వీలర్‌ను సోమవారం పిలిపించుకుని తీవ్ర నిరసన తెలిపింది. కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో పాల్గొన్న సభలో ఖలిస్థానీ అనుకూల నినాదాలు వినిపిస్తున్నా ఆయన పట్టించుకోకుండా వారికి మద్దతుగా మాట్లాడడంపై  భారత్‌ వెంటనే స్పందించింది. టొరంటోలో ఆదివారం నిర్వహించిన ‘ఖల్సా’ దినోత్సవానికి ప్రధాని ట్రూడోతో పాటు ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిక్కు ప్రజలను ఉద్దేశించి ట్రూడో ప్రసంగిస్తుండగా కొందరు ఖలిస్థానీ అనుకూల నినాదాలు చేశారు. ట్రూడో వారిని పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘‘సిక్కుల హక్కులు, స్వేచ్ఛను మేం ఎల్లప్పుడూ రక్షిస్తాం. మీరు స్వదేశంలోని మీ కుటుంబసభ్యులను చూసేందుకు వీలుగా భారత్‌, కెనడా మధ్య విమాన రాకపోకలను మరింత పెంచేందుకు కృషి చేస్తాం’’ అని ట్రూడో తెలిపారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ గతేడాది ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. కెనడా భూభాగంపై జరుగుతున్న ఖలిస్థానీ తీవ్రవాద కార్యకలాపాలను, హింసను అడ్డుకోకపోగా వారికి వత్తాసు పలికేలా ఆ దేశ ప్రధాని ట్రూడో మాట్లాడడంతో భారత్‌ ఆగ్రహించింది. ఖలిస్థానీవాదులకు రాజకీయ మద్దతివ్వడం సరికాదని, ఇరుదేశాల సంబంధాలపైనే కాకుండా కెనడా పౌరుల భద్రతను కూడా ఇది ప్రమాదంలోకి నెట్టివేస్తుందని ఆ దేశ డిప్యూటీ హై కమిషనర్‌ స్టీవార్ట్‌ వీలర్‌కు స్పష్టం చేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు