ప్రైవేటు వ్యక్తుల కోసం సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వమా?

సందేశ్‌ఖాలీ ఆగడాలపై దర్యాప్తు విషయంలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ప్రైౖవేటు వ్యక్తుల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఎలా ఆశ్రయిస్తుందని జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ధర్మాసనం సోమవారం ప్రశ్నించింది.

Published : 30 Apr 2024 04:55 IST

పశ్చిమ బెంగాల్‌ సర్కారును ప్రశ్నించిన సర్వోన్నత న్యాయస్థానం

దిల్లీ: సందేశ్‌ఖాలీ ఆగడాలపై దర్యాప్తు విషయంలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ప్రైౖవేటు వ్యక్తుల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఎలా ఆశ్రయిస్తుందని జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ధర్మాసనం సోమవారం ప్రశ్నించింది. పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడటం, భూములను కబ్జా చేయడం వంటి నేరాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఈ నెల 10న కలకత్తా హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ‘‘కొంతమంది ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వమే పిటిషనర్‌గా రావాల్సిన అవసరం ఏం వచ్చింది?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై పశ్చిమబెంగాల్‌ తరపున హాజరైన న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘‘కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. అవి సహేతుకం కాదు. ఎందుకంటే.. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది. హైకోర్టు వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయి. ఎటువంటి మార్గదర్శకాలు జారీ చేయకుండానే సీబీఐ దర్యాప్తునకు సహకరించాలని సర్కారుకు స్పష్టంచేసింది’’ అని తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ఆ వ్యాఖ్యలపై ఆక్షేపణ ఉంటే వాటిని తొలగించాలని హైకోర్టునే ఆశ్రయించవచ్చు కదా అని ప్రశ్నించింది. అనంతరం వేసవి సెలవుల తర్వాత వాదనలు వింటామంటూ విచారణను జులైకి వాయిదా వేసింది. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ మాట్లాడుతూ.. ఈ పిటిషన్‌పై కొద్దివారాల తర్వాత విచారణ చేపట్టాలని కోరారు. తమ వద్ద చాలా ముఖ్యమైన సమాచారం ఉందని, దాన్ని న్యాయస్థానం ముందు దాఖలు చేస్తామని చెప్పారు. ‘‘మీ విజ్ఞప్తి మేరకు విచారణను వాయిదా వేస్తున్నాం. అందువల్ల ఈ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండటాన్ని సాకుగా చూపి.. హైకోర్టులో కేసు విచారణను సాగదీయడానికి ప్రయత్నించకూడదు’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది.


ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో దీదీ సర్కారుకు ఊరట

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. ఈ వ్యవహారంపై తాము మే 6న విచారణ చేపడతామని తెలిపింది. బెంగాల్‌లో 2016లో రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్‌ఎల్‌ఎస్‌టీ) ద్వారా చేపట్టిన 25,753 నియామకాలు చెల్లవంటూ హైకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. ఈ కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మమత సర్కారు సుప్రీంను ఆశ్రయించగా తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని