కారు దాడి ఘటన కలచివేసింది: బైడెన్‌

అమెరికాలోని క్యాపిటల్‌ భవనం వద్ద కారు దాడి ఘటన తమను తీవ్రంగా కలిచి వేసిందని అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. ఈ దాడిలో మరణించిన పోలీస్‌ అధికారికి ఆయన నివాళి అర్పించారు. ఈ మేరకు బైడెన్‌ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

Updated : 03 Apr 2021 10:42 IST

వాషింగ్టన్‌: అమెరికాలోని క్యాపిటల్‌ భవనం వద్ద కారు దాడి ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. ఈ దాడిలో మరణించిన పోలీస్‌ అధికారికి ఆయన నివాళి అర్పించారు. ఈ మేరకు బైడెన్‌ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘యూఎస్ క్యాపిటల్‌ సెక్యూరిటీ తనిఖీ కేంద్రం వద్ద కారు దూసుకొచ్చిన ఘటనపై నేను, నా సతీమణి జిల్‌ తీవ్ర ఆవేదనకు లోనయ్యాం. ఈ ఘటనలో పోలీస్‌ అధికారి విలియమ్‌ మృతి చెందడం బాధాకరం. విలియమ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని బైడెన్‌ తెలిపారు.

‘క్యాపిటల్‌ భవనం వద్ద కారు దాడి ఘటనలో తక్షణం ప్రతిస్పందించిన భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సవాలు లాంటి ఇలాంటి సమయంలో క్యాపిటల్‌ను రక్షిస్తున్న వారిని చూసి ఎంతో గర్విస్తున్నా. ఈ దాడిలో అమరుడైన యూఎస్‌ క్యాపిటల్‌ పోలీసు అధికారి విలియమ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా’ అని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ వెల్లడించారు.

అమెరికాలోని క్యాపిటల్‌ భవనం వద్ద శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి  భద్రతా సిబ్బందిపైకి కారుతో దూసుకువచ్చిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పోలీసు అధికారి ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. భద్రతా దళాలు వెంటనే నిందితుడిని కాల్చిచంపాయి. అనంతరం అతడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఇది ఉగ్రదాడా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో క్యాపిటల్‌ వద్ద భారీగా భద్రత  మోహరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని