Biden: గణతంత్ర వేడుకలకు బైడెన్‌ రాకపోవచ్చేమో..!

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్(Jeo Biden) వచ్చే నెల భారత్‌లో పర్యటించకపోవచ్చని తెలుస్తోంది. గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా రాకపోవచ్చని సమాచారం. 

Published : 12 Dec 2023 19:28 IST

దిల్లీ: వచ్చే ఏడాది జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి(Republic Day) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. కొద్దినెలల క్రితం జీ20 సదస్సు సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా బైడెన్‌తో ప్రధాని మోదీ(Modi) మాట్లాడారని, గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా రావాల్సిందిగా అధ్యక్షుడిని ఆహ్వానించారని మనదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి గతంలో వెల్లడించారు.

1950 నుంచి భారత్‌ తన మిత్ర దేశాల నేతలను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం సంప్రదాయంగా వస్తోంది. 1952, 53, 66ల్లో మాత్రమే విదేశీ అతిథులు లేకుండా రిపబ్లిక్‌డే వేడుకలు నిర్వహించారు. 2007లో పుతిన్‌(రష్యా), 2008లో నికోలస్‌ సర్కోజీ(ఫ్రాన్స్‌), 2015లో బరాక్‌ ఒబామా (అమెరికా), 2016లో హోలన్‌ (ఫ్రాన్స్‌)లు అతిథులుగా హాజరయ్యారు. 2021లో నాటి బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను చీఫ్‌ గెస్ట్‌గా ఆహ్వానించారు. కానీ, కొవిడ్‌ కేసులు పెరగడంతో ఆయన పర్యటన రద్దైంది. 2018లో ఆసియాన్‌ దేశాల అధినేతలను గణతంత్ర దినోత్సవానికి ఆహ్వానించారు. 2023లో ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా అల్‌సీసీ హాజరయ్యారు. ఇక వచ్చే ఏడాది బైడెన్‌ హాజరుపై స్పష్టత రావాల్సి ఉంది.

డిపాజిట్‌ పెంచిన కెనడా.. భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపేనా?

అలాగే భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్‌ సదస్సుకు వచ్చే ఏడాది మన దేశం ఆతిథ్యం ఇవ్వనుందనే ప్రతిపాదన ఉంది. దీనిపై కూడా అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. బైడెన్‌ ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా వస్తే.. ఆ మరుసటి రోజు (జనవరి 27న) క్వాడ్‌ సదస్సును నిర్వహించొచ్చనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు బైడెన్ పర్యటన ఉండకపోవచ్చనే వార్తలతో.. క్వాడ్ సదస్సు కూడా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని