
Lakhimpur Kheri: లఖింపుర్ ఘటన స్పష్టమైన వీడియో.. ట్వీట్ చేసిన వరుణ్ గాంధీ
లఖ్‌నవూ: లఖింపుర్ ఖేరి ఘటనకు సంబంధించి విపక్షాల నిరసనల హోరు కొనసాగుతూనే ఉంది. ఇదే క్రమంలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు యూపీ ప్రభుత్వం బుధవారం ప్రతిపక్ష నేతలకు అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ తదితరులు మృతుల కుటుంబాలను ఓదార్చారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి అనేక వీడియోలు బయటకు రాగా, తాజాగా స్పష్టమైన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై ప్రదర్శనగా వెళ్తున్న రైతులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తున్నట్లు దీనిలో కనిపిస్తోంది. భాజపా ఎంపీ వరుణ్ గాంధీ సైతం గురువారం ఈ వీడియోను ట్వీట్ చేశారు. ‘ఈ వీడియో స్పష్టంగా ఉంది. హత్యల ద్వారా నిరసనకారుల నోరు మూయించలేం. చిందిన అమాయక రైతుల రక్తానికి జవాబుదారీ అవసరం. రైతుల మనస్సుల్లో అహంకారం, క్రూరత్వం ప్రవేశించక ముందే న్యాయం జరగాలి’ అని రాసుకొచ్చారు.
రెండు రోజుల క్రితం కూడ ఆయన ఇదే తరహా ఓ వీడియోను ట్వీట్ చేస్తూ.. ‘ఈ దృశ్యాలు ఎవరి ఆత్మనైనా కదిలిస్తాయ’ని పేర్కొన్నారు. వీడియో ఆధారంగా వాహనాల యజమానులను, అందులో కూర్చున్నవారిని, ఘటనతో సంబంధం ఉన్నవారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన పోలీసులను కోరారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో ఆదివారం రైతులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన ఘటనల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారి తీసింది. తాజాగా ఈ ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం నేడు ఈ అంశంపై విచారణ చేపట్టనుంది.