Vaccination Drive: మహారాష్ట్ర ‘మిషన్‌ కవచ్‌ కుండల్‌’.. రోజుకు 15 లక్షల టీకాలే లక్ష్యం

టీకా పంపిణీలో దూసుకెళ్తున్న భారత్‌.. 100 కోట్ల డోసుల మార్కును అందుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దసరా(అక్టోబరు 15)కు ముందే ఈ లక్ష్యాన్ని సాధించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను సమాయాత్తం చేస్తోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర...

Published : 07 Oct 2021 23:11 IST

ముంబయి: టీకా పంపిణీలో దూసుకెళ్తున్న భారత్‌.. 100 కోట్ల డోసుల మార్కును అందుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దసరా(అక్టోబరు 15)కు ముందే ఈ లక్ష్యాన్ని సాధించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను సమాయాత్తం చేస్తోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం ‘మిషన్‌ కవచ్‌ కుండల్‌’ను ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అక్టోబరు 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు రోజుకు 15 లక్షల చొప్పున కొవిడ్‌ టీకాలు వేయనున్నారు. ఈ విషయమై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్‌ తోపే మాట్లాడుతూ.. దసరాకు ముందే దేశవ్యాప్తంగా 100 కోట్ల డోసుల పంపిణీ చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ మిషన్‌ కింద రోజుకు 15 లక్షల డోసులు వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ‘ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 60 శాతం మంది ఇప్పటికే మొదటి డోసు వేయించుకున్నారు. 30 శాతం మందికి రెండు డోసులూ పూర్తయ్యాయ’ని తోపే వెల్లడించారు. మూడో వేవ్‌ గురించి మాట్లాడుతూ.. దసరా, దీపావళి పండుగల తర్వాత ఈ విషయంపై స్పష్టత వస్తుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటామని వెల్లడించారు.
మరోవైపు దేశవ్యాప్తంగా గురువారం నాటికి 93 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కొవిడ్‌పై పోరులో మరో ఘనత సాధించినట్లు ట్వీట్‌ చేసింది. దేశంలో కొవిడ్‌ వ్యాప్తి కొనసాగుతోందని, గడచిన వారం వ్యవధిలో దేశవ్యాప్తంగా రోజుకు సరాసరి 20 వేల చొప్పున కేసులు బయటపడ్డాయని చెప్పింది. ఇందులో 56 శాతం కేరళనుంచే వచ్చాయని పేర్కొంది. పాజిటివిటి రేటు 1.8 శాతంగా నమోదైందని తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని