Air India: విమానం ఫ్లోర్‌పైనే మలమూత్ర విసర్జన.. ఎయిరిండియాలో మరో ఘటన

దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సంస్థకు చెందిన విమానంలో ఓ ప్రయాణికుడు ఫ్లోర్‌పైనే మల, మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు.

Updated : 27 Jun 2023 15:31 IST

దిల్లీ: ఎయిరిండియా (Air India)లో మరో ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ముంబయి - దిల్లీ విమానం (Mumbai-Delhi flight)లో ప్రయాణించిన ఓ వ్యక్తి విమానం ఫ్లోర్‌పై మల, మూత్ర విసర్జన చేశాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. జూన్‌ 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గత శనివారం (జూన్‌ 24) ముంబయి నుంచి దిల్లీ వెళ్లిన ఎయిరిండియా ఏఐసీ 866 విమానంలో రామ్‌ సింగ్‌ అనే వ్యక్తి ప్రయాణించాడు. అయితే, 17ఎఫ్‌ సీట్లో కూర్చున్న అతడు.. తొమ్మిదో వరుస వద్దకు వెళ్లి ఫ్లోర్‌పై ఉమ్మివేశాడు. ఆ తర్వాత మల, మూత్ర విసర్జన చేశాడు. రామ్‌ సింగ్ చేష్టలను గమనించిన క్యాబిన్‌ సిబ్బంది అతడిని మౌఖికంగా హెచ్చరించారు. అతడి అసభ్య ప్రవర్తనతో తోటి ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీంతో ఇతర ప్రయాణికులకు దూరంగా అతడిని క్యాబిన్‌ సిబ్బంది ఐసోలేట్‌ చేశారు.

అనంతరం పైలట్‌ ఇన్‌ కమాండ్‌కు సిబ్బంది సమాచారమందించారు. పైలట్‌ వెంటనే సంస్థ ఉన్నతాధికారులకు మెసేజ్‌ పంపించారు. విమానం ల్యాండ్‌ అవ్వగానే ఎయిరిండియా (Air India) భద్రతా సిబ్బంది ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే, అతడు మద్యం మత్తులో ఇలా అనుచితంగా ప్రవర్తించాడా? లేదా ఉద్దేశపూర్వకంగానే చేశాడా? అన్నది తెలియరాలేదు.

స్పందించిన ఎయిరిండియా..

ఘటనపై ఎయిరిండియా మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ముంబయి-దిల్లీ విమానంలో ఓ ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించి తోటి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాడు. ఈ ఘటన తర్వాత విమానంలో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు మా సిబ్బంది వేగంగా స్పందించి ప్రయాణికుడిని ఐసోలేట్‌ చేశారు. విమానం ల్యాండ్‌ అవ్వగానే సదరు వ్యక్తిని భద్రతా సిబ్బందికి అప్పగించారు. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇలాంటి వికృత, అభ్యంతరకర ప్రవర్తనను మేం ఎన్నటికీ సహించబోం. పోలీసుల దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తాం’’ అని ఎయిరిండియా స్పష్టం చేసింది.

గతేడాది నవంబరులోనూ ఓ ఎయిరిండియా విమానంలో ఈ తరహా ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతరం ఆ ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై అటు డీజీసీఏ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఎయిరిండియాకు జరిమానా విధించింది. ఆ తర్వాత కూడా పలుమార్లు ఈ సంస్థకు చెందిన విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన ఘటనలు వార్తల్లోకెక్కాయి. దీంతో ఎయిరిండియా చర్యలకు ఉపక్రమించింది. ప్రయాణికుల ప్రవర్తనా నియమావళిని కఠినతరం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు