molnupiravir: కొవిడ్‌ చికిత్సలో మోల్నూపిరవిర్‌తో సానుకూల ఫలితాలు

ప్రముఖ అంతర్జాతీయ ఔషధ సంస్థ మెర్క్‌ అండ్‌ కో, రిడ్జ్‌ బ్యాక్‌ బయోథెరిపిక్స్‌ సంస్థలు మాత్ర రూపంలో తయారు చేసిన కొవిడ్‌ ఔషధం సానుకూల ఫలితాలను ఇస్తోంది.

Published : 03 Oct 2021 22:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ అంతర్జాతీయ ఔషధ సంస్థ మెర్క్‌ అండ్‌ కో, రిడ్జ్‌ బ్యాక్‌ బయోథెరిపిక్స్‌ సంస్థలు మాత్ర రూపంలో తయారు చేసిన కొవిడ్‌ ఔషధం సానుకూల ఫలితాలను ఇస్తోంది. ఆసుపత్రిలో చేరే అవసరాన్ని, మరణించే ప్రమాదాన్ని సగానికిపైగా తగ్గిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. వైరస్‌ జన్యుక్రమంలో సమస్యలు సృష్టించి శరీరంలో విస్తరించకుండా చేస్తుంది. ఈ విషయాన్ని జాన్‌ హప్‌కిన్స్‌ విశ్వవిదాలయ స్కాలర్‌  అమేష్‌ పేర్కొన్నారు. ఒక వేళ దీనికి ఆమోదం లభిస్తే.. కొవిడ్‌ కోసమే ప్రత్యేకంగా చేసిన తొలి యాంటీవైరల్‌ ఔషధంగా నిలుస్తుంది. 

ప్రస్తుతం చికిత్సలో వాడుతున్న పలు యాంటీవైరల్‌, ఇతర ఔషధాల వినియోగం కొంచెం కష్టంగానే ఉంది. కానీ, మోల్నూపిరవిర్‌ను కేవలం నోటి నుంచి తీసుకొనే ఔషధంగా మాత్రమే వాడవచ్చు. ఈ పరిణామాలపై ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ పీటర్‌ హర్బే మాట్లాడుతూ ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో సురక్షితమైన, చౌకైన యాంటీవైరల్‌ ఔషధం అందుబాటులోకి రావడం ముఖ్యం. ఇది కొవిడ్‌పై పోరాటంలో చాలా అవసరం’’ అని పేర్కొన్నారు. 

మెర్క్‌ సంస్థ మొత్తం 775 మందిపై  ప్రయోగాలు నిర్వహించింది. వీరిలో రెండు పూటలా మోల్నూపిరవిర్‌ ఐదు రోజులు తీసుకొన్న వారిలో 7.5శాతం మంది మాత్రమే ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో ఎవరూ చనిపోలేదు. అదే ప్లెసిబో తీసుకొన్న వారిలో 14.1శాతం మంది ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. వారిలో 8 మంది మరణించారు. ‘ కొవిడ్‌ రోగులు ఆసుపత్రిలో చేరకుండా ఉండేందుకు ఈ యాంటీ వైరల్‌ చికిత్సను ఇంటి వద్దనే తీసుకోవడం చాలా ముఖ్యం’’ అని రిడ్జ్‌బ్యాక్‌ సీఈవో వెన్డీ హోల్మన్‌ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని