అసంపూర్ణ ప్రాజెక్టుల ప్రారంభంపై కాదు.. ఉక్రెయిన్‌ విద్యార్థుల తరలింపుపై దృష్టి పెట్టండి: పవార్‌

Sharad Pawar: పుణెలో అసంపూర్ణ ప్రాజెక్టుల ప్రారంభం కంటే ముందు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థుల తరలింపుపై కేంద్రం దృష్టి పెడితే మంచిదని ఎన్సీపీ అధినేత పవార్‌ వ్యాఖ్యానించారు.

Updated : 06 Mar 2022 04:31 IST

పుణె: ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతున్న వేళ అక్కడ చదువుకోవడానికి వెళ్లిన భారత విద్యార్థులు స్వదేశానికి వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు విద్యార్థులను కేంద్రం ఇప్పటికే తరలించినప్పటికీ.. మరికొంతమందిని ఇంకా తీసుకురావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వారి తరలింపు అంశంలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కేంద్రాన్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసంపూర్ణ ప్రాజెక్టులను ప్రారంభించడం కంటే ముందు.. ఉక్రెయిన్‌ విద్యార్థులను తరలించే విషయంపై దృష్టిసారించాలని సూచించారు. పుణె మెట్రో రైలు సర్వీసులతో పాటు, ఇతర ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఆదివారం ప్రధాని మోదీ విచ్చేస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

‘‘ఇటీవల ఉక్రెయిన్‌లో చిక్కుకున్న కొంతమంది మన దేశ విద్యార్థులతో మాట్లాడాను. తామున్న ప్రదేశం నుంచి ఉక్రెయిన్‌ సరిహద్దులకు చేరుకోవడానికి సుమారు ఆరు గంటలకు పైగా సమయం పడుతోందని వారు నాకు చెప్పారు. విద్యార్థులు నడిచేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ చలి, ఓ వైపు బాంబుల మోత వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయంలో విద్యార్థుల తరలింపుపై అధికార భాజపా దృష్టి పెట్టాల్సి ఉంది. పుణెలో చాలా ముఖ్యమైన ప్రాజెక్టులు ఉన్నా.. అవి అసంపూర్తిగా ఉన్నాయి. వీటిని ప్రారంభించడం కంటే ముందు విద్యార్థుల తరలింపు అంతకంటే ముఖ్యం. దీనిపై భాజపా ఆలోచన చేయాలి’’ అంటూ వ్యంగ్య బాణాలు సంధించారు. మోదీ ప్రారంభించబోయే మెట్రో రైలు ప్రాజెక్టును నెల క్రితమే తాను సందర్శించానని, చాలా పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. మోదీ రాకను తాను వ్యతిరేకించడం లేదు గానీ.. పూర్తికాని ప్రాజెక్టులను ప్రారంభించడం గురించే తాను మాట్లాడుతున్నానని పవార్‌ పేర్కొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని