Tamil Nadu: ఈడీ అరెస్టుతో చెన్నైలో హైడ్రామా.. మంత్రికి బైపాస్ సర్జరీ చేయాలన్న ఆసుపత్రి వర్గాలు

డీఎంకే మంత్రి సెంథిల్‌(Senthil Balaji)ను ఈడీ అరెస్టు చేయడంతో తమిళనాడు రాజధాని చెన్నై కేంద్రంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఆ మంత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 

Published : 14 Jun 2023 14:23 IST

చెన్నై: మనీలాండరింగ్‌ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి, డీఎంకే నేత వి.సెంథిల్‌ బాలాజీ (Senthil Balaji)ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దాంతో రాష్ట్రంలో హైడ్రామా కొనసాగుతోంది. అరెస్టు తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకొచ్చే సమయంలో మంత్రి ఛాతి నొప్పి తట్టుకోలేక ఏడ్చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఆయనకు సాధ్యమైనంత త్వరగా బైపాస్‌ సర్జరీ చేయాలని వైద్యులు వెల్లడించారు. మరోపక్క ఈ అరెస్టుపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

మంత్రికి వైద్యులు కరోనరి యాంజియోగ్రామ్‌ నిర్వహించారు. అనంతరం ట్రిపుల్‌ వెస్సెల్‌ డిసీజ్‌తో బాధపడుతున్న ఆయన్ను బైపాస్‌ సర్జరీ చేయించుకోవాలని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి బులిటెన్‌ జారీ చేసింది. 

మంగళవారం నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సెంథిల్‌ బాలాజీని మనీ లాండరింగ్‌కు సంబంధించిన కేసులో ప్రశ్నించారు. అనంతరం అర్ధరాత్రి తర్వాత అదుపులోకి తీసుకొన్నారు. వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తెచ్చిన సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఈసీజీ పరీక్షల్లో మాత్రం అసాధారణ ఫలితాలు వస్తున్నా.. రక్తపరీక్షలో మాత్రం గుండెపోటు ఆనవాళ్లు లేవని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఉదయం 10 గంటల సమయంలో యాంజియోగ్రామ్‌ పరీక్షలకు తీసుకెళ్లారు. అతడికి ట్రిపుల్‌ వెస్సెల్‌ డిసీజ్‌ ఉన్నట్లు గుర్తించారు. దీంతో వీలైనంత త్వరగా బైపాస్‌ సర్జరీ చేయించుకోవాలని సూచించారు. దీనిపై ఈడీ అధికారులు స్పందిస్తూ సెంథిల్‌ బాలాజీని అరెస్టు చేశామని చెప్పారు. ఆయన ఛాతిలో నొప్పి అని తెలియజేయడంతో ఆస్పత్రిలో చేర్చామన్నారు. డిశ్ఛార్జి అయ్యాక న్యాయస్థానం ఎదుట ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఆ తర్వాత ఏం చేయాలనేది కోర్టు నిర్ణయిస్తుందని తెలిపారు.

భాజపా ముందు తలవంచం..

సెంథిల్ ఆరోగ్యపరిస్థితిపై డీఎంకే నేత పీకే శేఖర్ బాబు స్పందించారు. ‘ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు. ఆయన స్పృహలో లేరు. పేరు పెట్టి పిలిచినా స్పందించడం లేదు. చెవి దగ్గర వాపు వచ్చింది. ఈసీజీలో తేడా కనిపించిందని, ఆయన్ను హింసించారనేదానికి అది గుర్తని వైద్యులు చెప్పారు’ అని ఆరోపించారు. తాము భాజపా(BJP) ముందు తలవంచమని తమిళనాడు క్రీడాశాఖ మంత్రి, డీఎంకే యూత్‌ వింగ్ చీఫ్‌ ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఈ అరెస్టుపై సెంథిల్ భార్య మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అత్యవసర విచారణకు కోర్టు అంగీకరించింది.

స్టాలిన్(MK Stalin) పరామర్శ..

ఇదిలా ఉంటే.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రిని స్టాలిన్(MK Stalin) పరామర్శించారు. ‘తాను సహకరిస్తానని మంత్రి చెప్పిన తర్వాత కూడా ఛాతి నొప్పి వచ్చేంతగా దర్యాప్తు సంస్థ ఈడీ ఆయన్ను విచారించాల్సిన అవసరం ఏమొచ్చింది? కేసుకు సంబంధించిన చట్టపరమైన అంశాలను ఉల్లంఘిస్తూ ఇంతగా మానవత్వం లేని విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఏముంది. భాజపా బెదిరింపులకు డీఎంకే బెదరదు. 2024 ఎన్నికల్లో ప్రజలు భాజపాకు గుణపాఠం చెప్తారు’ అని స్టాలిన్ ట్విటర్ వేదికగా స్పందించారు.

గతంలో అన్నాడీఎంకే పార్టీలో ఉన్న సెంథిల్‌ (Senthil Balaji).. దివంగత జయలలిత ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, ఆ సమయంలో రవాణా శాఖలోని ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ(Enforcement Directorate) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇదిలా ఉంటే.. సెంథిల్‌ అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై స్టాలిన్ విమర్శలు చేసిన వీడియోను భాజపా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(Tamil Nadu BJP chief K Annamalai) ట్విటర్‌లో షేర్ చేశారు. ఆ రోజు విమర్శించిన స్టాలిన్‌.. ఈ రోజు అందుకు భిన్నంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని