Viral Video: కలెక్టర్‌నే ఆటపట్టించిన కోతులు.. అసలేం జరిగిందంటే..!

జిల్లా కలెక్టర్‌ (Mathura District Collector) కళ్లజోడును కోతులు ఎత్తుకెళ్లిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

Published : 22 Aug 2022 13:59 IST

మథుర: కోతులు (Monkey) చేసే కొంటెపనులు మనకు తెలియనివి కాదు. మన చేతిలోని తినుబండారాలు, పిల్లలు ఆడుకునే వస్తువులను ఎత్తుకెళ్లే ఘటనలు ఒక్కోసారి హాస్యాన్ని తెప్పిస్తుంటాయి. ఈ క్రమంలో ఏకంగా జిల్లా కలెక్టర్‌ (District Collector)నే ఆటపట్టించిన కోతులు.. ఆయన కళ్లజోడును ఎత్తుకెళ్లాయి. కలెక్టర్‌ అయితే మాకేంటి అన్న రీతిలో కోతులు చేసిన కొంటెపనికి అక్కడి వారంతా అవాక్కయ్యారు. ఇలా కోతులు చేసిన కొంటె చేష్టలకు ఉన్నతాధికారులే వాటిని వేడుకోవాల్సి వచ్చింది. చివరకు కోతి ఆ కళ్లజోడును తిరిగి ఇవ్వడంతో కలెక్టర్‌తోపాటు అధికారులందరూ నవ్వుకుంటూ అక్కడ నుంచి బయలుదేరారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

యూపీలోని మథుర (Mathura) జిల్లా కలెక్టర్‌ నవ్‌నీత్‌ చాహల్‌ ఉన్నతాధికారులతో కలిసి ఇటీవల బృందావన్‌ (Vrindavan) ప్రాంతంలో పర్యటించారు. కోతులు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో జిల్లా కలెక్టర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఓ కోతి వచ్చి ఏకంగా కలెక్టర్‌ (District Collector) కళ్లజోడును ఎత్తుకెళ్లింది. అనంతరం అక్కడే ఉన్న ఇనుప చువ్వలపై కూర్చుండిపోయింది. అక్కడే ఉన్న పోలీసులు, అధికారులతోపాటు జనమంతా వాటిని తిరిగి ఇవ్వాలంటూ కోతిని బుజ్జగించడం మొదలుపెట్టారు. అలా కాసేపటి తర్వాత కోతి వాటిని తిరిగి ఇచ్చింది. ఈ వీడియోను సుసంత నందా అనే ఓ ఐఎఫ్‌ఎస్‌ అధికారి ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తోన్న నెటిజన్లు.. కోతికి ఏం ఇస్తానని కలెక్టర్‌ హామీ ఇచ్చారో అంటూ ఛలోక్తులు విసురుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు