Myanmar: ఆంగ్‌ సాన్‌ సూకీకి నాలుగేళ్ల జైలు.. తీర్పుచెప్పిన మిలిటరీ జుంటా

ఈ ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేపట్టి అధికారాన్ని కైవసం చేసుకున్న అక్కడి సైన్యం.. ఆంగ్‌ సాన్‌ సూకీ సహా పలువురు కీలక నేతలను నిర్బంధించిన విషయం తెలిసిందే. వారిపై అవినీతి, ఎన్నికల్లో మోసాలు తదితర అభియోగాలు...

Updated : 06 Dec 2021 15:38 IST

యాంగోన్‌: ఈ ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేపట్టి అధికారాన్ని కైవసం చేసుకున్న అక్కడి సైన్యం.. ఆంగ్‌ సాన్‌ సూకీ సహా పలువురు కీలక నేతలను నిర్బంధించిన విషయం తెలిసిందే. వారిపై అవినీతి, ఎన్నికల్లో మోసాలు తదితర అభియోగాలు మోపి, విచారణ చేపడుతోంది. ఈ క్రమంలోనే దేశ సైన్యానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడంతోపాటు కొవిడ్‌ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకుగానూ సూకీకి సోమవారం మిలిటరీ జుంటా నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది.

సైన్యానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టినందుకు రెండేళ్లు, కొవిడ్‌కు సంబంధించిన ప్రకృతి విపత్తు చట్టాన్ని ఉల్లంఘించినందుకు మరో రెండేళ్ల జైలు శిక్ష విధించినట్లు జుంటా ప్రతినిధి జా మిన్ తున్  తెలిపారు. మాజీ అధ్యక్షుడు విన్ మైంట్‌కు సైతం ఇవే అభియోగాలపై నాలుగేళ్ల శిక్ష పడింది. అయితే, వారిని ఇంకా జైలుకు తరలించలేదని, మరిన్ని అభియోగాలపై విచారణ చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. వీటిలో దోషిగా తేలితే, వారికి దశాబ్దాలపాటు శిక్షపడే అవకాశం ఉంది.

మరోవైపు హక్కుల పరిరక్షణ సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ శిక్షలను ఖండించింది. తప్పుడు ఆరోపణలపై సూకీకి విధించిన శిక్ష.. స్థానికంగా వ్యతిరేకతలను నిర్మూలించేందుకు సైన్యం తీసుకుంటున్న చర్యలకు ఉదాహరణ అని సంస్థ క్యాంపెయిన్స్‌ డిప్యూటీ రీజినల్‌ డైరెక్టర్ మింగ్ యు హా అన్నారు. ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ మయన్మార్ సీనియర్ సలహాదారు రిచర్డ్ హార్సే కూడా దీన్ని.. ప్రతీకార చర్యగా అభివర్ణించారు. మిలిటరీ అధికార ప్రదర్శనకు నిదర్శనమని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు