Boycott Olympics: ఆట మొదలు..!

వీగర్‌ ముస్లింల విషయంలో చైనా అనుసరిస్తున్న వైఖరితో బీజింగ్‌ వింటర్‌ ఒలిపిక్స్‌ -2022కు ఎసరు వచ్చేట్లుంది. ఈ ఒలింపిక్స్‌ను ప్రపంచ దేశాలు బహిష్కరించడం

Updated : 21 Dec 2022 14:50 IST

* బీజింగ్‌ ఒలింపిక్స్‌కు బాయ్‌కాట్‌ భయం

* గళమెత్తిన నాన్సీ పెలోసీ

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

వీగర్‌ ముస్లింల విషయంలో చైనా అనుసరిస్తున్న వైఖరితో బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ -2022కు ఎసరు వచ్చేట్లుంది. ఈ ఒలింపిక్స్‌ను ప్రపంచ దేశాలు బహిష్కరించడం గానీ, వేదికను మార్చడం గానీ చేయాలన్న డిమాండ్లు మెల్లగా ఊపందుకుంటున్నాయి.  ఇప్పటికే 180కిపైగా మానవ హక్కుల సంస్థలు ఈ ఒలింపిక్స్‌ను బహిష్కరించాలనే డిమాండ్లను ప్రభుత్వాల ముందు పెట్టాయని ‘ది గార్డియన్‌ ’ పత్రిక పేర్కొంది. దీంతో చైనా వీటిని అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కొన్ని సందర్భాల్లో బహిరంగంగా బెదిరింపులకు దిగుతోంది.

తాజాగా వీగర్ల విషయంలో చైనాను కట్టడి చేయడానికి ఒలింపిక్స్‌ను ఆయుధంగా వాడాలని అమెరికాలో అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరైనా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ మరోసారి తెరపైకి తెచ్చారు. మంగళవారం ఆమె అమెరికా కాంగ్రెస్‌ విచారణలో మాట్లాడుతూ చైనా వీగర్లపై చేస్తున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా బీజింగ్‌లో 2022లో జరిగే ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరించాలని(డిప్లొమేటిక్‌ బాయ్‌కాట్‌) పిలుపునిచ్చారు. అక్కడ ఎటువంటి తప్పు జరగకపోతే తాము ఈ నిర్ణయం తీసుకోమని అన్నారు.  ప్రపంచ దేశాల అధినేతలు ఎవరూ ఈ ఒలింపిక్స్‌ కార్యక్రమాలకు హాజరుకాకూడదన్నారు. ఇప్పటికే ఆమె అమెరికా మిత్రదేశాల దేశాధినేతలు కూడా ఈ ఒలింపిక్స్‌కు హాజరుకాకుండా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సీఎన్‌బీసీ కథనంలో పేర్కొంది.  ఒక మానవ హక్కుల సంస్థ సోమవారం అమెరికా నాయకులకు బహిరంగ లేఖ రాసిన తర్వాత పెలోసీ నుంచి ఇటువంటి ప్రతిపాదన వచ్చింది.

డిప్లొమేటిక్‌ బాయ్‌కాట్‌ అంటే..?

డిప్లొమేటిక్‌ బాయ్‌కాట్‌ అంటే క్రీడలను బాయ్‌కాట్‌ చేయడం కాదు. అథ్లెట్లు హాజరై క్రీడల్లో పాల్గొంటారు. కానీ, ఒలింపిక్స్‌లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమం, ముగింపు కార్యక్రమం వంటి వాటికి  దేశాధినేతలు, కీలక అధికారులు హాజరుకాకపోవడం. ఇలా చేయడం వల్ల ఆ ఒలింపిక్స్‌ ప్రాధాన్యం తగ్గిపోతుంది.  అదే సమయంలో చైనా వీగర్ల పట్ల చేస్తున్న అత్యాచారాలు ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచి చర్చనీయాంశాలు అవుతాయి. ఆ రకంగా చైనాపై ఒత్తిడి పెరుగుతుంది.

ఎవరీ  నాన్సీ పెలోసి..?

అమెరికాలోని మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో 1940 మార్చి 26న రాజకీయ కుటుంబంలో జన్మించింది నాన్సీ పెలోసి. తండ్రి, సోదరుడు ఈస్ట్‌ కోస్ట్‌ పోర్ట్‌ సిటీ మేయర్లుగా పనిచేశారు. వాషింగ్టన్‌లో రాజనీతి శాస్త్రం చదివిన నాన్సీ... తొలిసారి కాలిఫోర్నియా నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌లోకి అడుగుపెట్టింది. భర్త పేరు పాల్‌ పెలోసి. వ్యాపారవేత్త. ఫేస్‌బుక్‌, ఆపిల్‌, డిస్నీ లాంటి సంస్థల్లో కూడా ఈయనకి వాటాలున్నాయి. వీరికి ఐదుగురు పిల్లలు. అమెరికా రాజకీయాల్లో ప్రత్యర్థులకు మింగుడుపడని మహిళగా నాన్సీకి పేరుంది. ట్రంప్‌ను ముప్పుతిప్పలు పెట్టిన డెమొక్రాట్‌ కూడా ఈమే కావడం విశేషం.

గతంలో చెప్పినా.. బుష్‌ వినలేదు.. 

చైనా అరాచకాల విషయంలో నాన్సీ మొదటి నుంచి తీవ్రంగానే స్పందించేవారు. గతంలో టిబేట్‌ వాసులపై చైనా అరాచకాలపై గళం విప్పారు. జార్జి డబ్ల్యూ బుష్‌ అధికారంలో ఉండగా అప్పట్లో జరిగిన బీజింగ్‌ సమ్మర్‌ ఒలింపిక్స్‌ను బహిష్కరించాలని ఆయనకు సూచించారు. అప్పటికే ఆమె యూఎస్‌ హౌస్‌ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బుష్‌ బీజింగ్‌ సందర్శించడాన్ని మరింత కఠినతరం చేసేలా ఆమె భారత్‌కు వచ్చి దలైలామాతో భేటీ కూడా అయ్యారు.  చైనా ప్రభుత్వం టిబేట్‌ స్వయం ప్రతిపత్తిపై దలైలామాతో చర్చించాలని ఏబీసీ న్యూస్‌ ఛానల్‌లో జరిగిన ‘గుడ్‌మార్నింగ్‌ అమెరికా’  ప్రోగ్రామంలో పేర్కొన్నారు. కానీ, నాటి అధ్యక్షుడు బుష్‌ ఆమె మాట వినలేదు. బీజింగ్‌ ఒలింపిక్స్‌కు హాజరయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయి ఇరుదేశాల మధ్య వివాదాలను తగ్గించుకొనేందుకు దీనిని అవకాశంగా మార్చుకొన్నారు.  ఈసారి పెలోసీ మాటను ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు  బైడెన్‌ ఎంతమేరకు వింటారు అనేది ప్రశ్నార్థకమే.

యూకే కూడా బహిష్కరణ బాటలో..?

యూనైటెడ్‌ కింగ్‌ డమ్‌లోని లేబర్‌, కన్జర్వేటీవ్‌ పార్టీ నేతలు ఇప్పటికే ఒలింపిక్స్‌ను పూర్తిగా బహిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఐరోపా సంఘంలోని చాలా దేశాల ప్రజాప్రతినిధులు కూడా వీగర్లకు మద్దతుగా నిలుస్తున్నారు. గతేడాది నవంబర్‌లో ఆస్ట్రేలియాలోని ఇద్దరు సెనెటర్లు కూడా ఈ ఒలింపిక్స్‌ను బహిష్కరించాలనే ప్రతిపాదనలు తీసుకొచ్చారు.

చైనా బెదిరింపులు..

గత నెలలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వీగర్ల విషయంలో మిత్రపక్షాలతో మాట్లాడి వ్యూహాన్ని సిద్ధం చేస్తామని అన్నారు. ఈ వ్యూహంలో ఒలింపిక్స్‌ బహిష్కరణ కూడా ఒక మార్గంగా అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. దీనిపై అప్పట్లో శ్వేతసౌధం సెక్రటరీ జెన్‌సాకీ స్పందిస్తూ ప్రస్తుతానికి ఒలింపిక్స్‌ బహిష్కరణ అంశాన్ని పరిశీలించడంలేదని పేర్కొన్నారు. దీనిపై చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ తీవ్రంగా స్పందించారు. అమెరికా కనుక ఈ క్రీడలను బహిష్కరిస్తే చైనా నుంచి తీవ్రమైన స్పందన ఉంటుందని పేర్కొన్నారు. క్రీడలను రాజకీయం చేస్తే ఒలింపిక్‌ స్ఫూర్తి దెబ్బతింటుందని అన్నారు. తాజాగా నాన్సీ పెలోసీ వంటి బడానేత ఈ డిమాండ్‌ను ముందుకు తీసుకురావడంతో మళ్లీ చైనాలో టెన్షన్‌ మొదలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని