Tauktae: నౌకల్లో 146 మందిని కాపాడిన నేవీ

దేశ పశ్చిమ తీరంపై విరుచుకుపడిన ‘తౌక్టే’ తుపాను బలహీనపడింది. తుపాను ధాటికి తీర ప్రాంతాలు అల్లాడిపోయాయి. మహారాష్ట్ర, గుజరాత్‌లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం

Updated : 18 May 2021 10:10 IST

కొనసాగుతున్న సహాయకచర్యలు

ముంబయి: దేశ పశ్చిమ తీరంపై విరుచుకుపడిన ‘తౌక్టే’ తుపాను బలహీనపడింది. తుపాను ధాటికి తీర ప్రాంతాలు అల్లాడిపోయాయి. మహారాష్ట్ర, గుజరాత్‌లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. అటు ముంబయి తీరంలో కొట్టుకుపోయిన రెండు భారీ నౌకల్లో ఉన్న 410 మంది సిబ్బందిని రక్షించడం కోసం నౌకాదళ సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 146 మందిని నేవీ సిబ్బంది కాపాడారు. 

బాంబే హై ప్రాంతంలోని హీరా చమురు క్షేత్రంలో ఓఎన్జీసీ రిగ్గుల వద్ద పనిచేస్తున్న రెండు భారీ నౌకలు సోమవారం మధ్యాహ్నం సమయంలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. లంగరు వేసి ఉంచినా పెనుగాలుల ధాటికి నౌకలు కొట్టుకుపోయాయి. ఓఎన్జీసీకి చెందిన పీ305 నౌకలో 273 మంది సిబ్బంది ఉండగా..  గాల్‌ కన్సట్రక్టర్‌కు చెందిన మరో నౌకలో 137 మంది ఉన్నారు. సమాచారమందుకున్న భారత నౌకదళం హుటాహుటిన మూడు యుద్ధ నౌకల్ని సహాయం కోసం పంపింది.  ఇప్పటివరకు పీ305 నౌకలోని 146 మంది సిబ్బందిని నేవీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చగా మరో 127 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

హెలికాప్టర్ల ద్వారా సిబ్బందిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే గాలులు ఎక్కువగా వీస్తుండటం వల్ల సహాయకచర్యలు ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. అత్యంత కఠిన సవాళ్ల నడుమ రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నట్లు నేవీ అధికార ప్రతినిధి తెలిపారు. గాల్‌ కన్సట్రక్టర్‌కు చెందిన మరో నౌక సముద్రంలోని అలల ఉద్దృతికి మరింత దూరం కొట్టుకుపోతోందని చెప్పారు. అక్కడ కూడా సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. 

బలహీనపడిన తౌక్టే

తీర రాష్ట్రాలపై విరుచుకుపడిన తౌక్టే తుపాను మంగళవారం తెల్లవారుజామున గుజరాత్‌లోని సౌరాష్ట్ర వద్ద తీరాన్ని తాకింది. ఆ తర్వాత బలహీన పడి తీవ్ర తుపానుగా మారినట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. అయితే తుపాను ప్రభావంతో గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో రాష్ట్రంలో నలుగురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారుం. తుపాను ప్రభావంతో సూరత్‌ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. అటు ముంబయిలోని భారీ వర్షంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. అనేక చోట్ల చెట్లు నేలకూలాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని