Satyendar Jain: మొన్న మసాజ్‌ వీడియో.. నేడు ఫుడ్ ఫుటేజ్‌..!

ఆప్‌ను ఇరకాటంలో పెట్టే మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ పార్టీ మంత్రి సత్యేందర్‌ జైన్‌కు జైల్లో ప్రత్యేక వసతులు అందుతున్నట్లు దాని ద్వారా వెల్లడవుతోంది.

Updated : 23 Nov 2022 11:17 IST

దిల్లీ: జైల్లో ఉన్న ఆప్‌ మంత్రి సత్యేందర్ జైన్‌ను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. అక్కడ ఆయనకు ప్రత్యేక వసతులు అందుతున్నాయంటూ మరో వీడియో వెలుగులోకి వచ్చింది. మత విశ్వాసాలకు అనుగుణంగా తనకు తగిన ఆహారం అందించడం లేదంటూ జైన్‌ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ వీడియో బయటకు వచ్చింది.

మంత్రి జైలు గది సీసీటీవీ దృశ్యాల్లో ఆయనకు సలాడ్లు, పండ్లు, ఇతర ఆహారం అందుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫుటేజ్‌ .. జైన్‌ ఆరోపణలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతోందని జైలు వర్గాలు వ్యాఖ్యానించాయి. ఆయన చెప్తున్నట్లు 28కేజీలు తగ్గలేదని, పైగా 8 కేజీలు పెరిగారని పేర్కొన్నాయి. తన విశ్వాసాలకు అనుగుణంగా తనకు ఆహారం అందించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. తాను అరెస్టయిన దగ్గరి నుంచి జైలు అధికారులు ఆహారం, ఔషధాలు నిరాకరిస్తున్నారంటూ మంత్రి పిటిషన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఇదివరకు మసాజ్‌ వీడియో బయటకు రాగా.. అందులో మర్దనా చేస్తోన్న వ్యక్తి ఫిజియోథెరపిస్టు కాదని రేపిస్టు అని జైలు వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై భాజపా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.  ‘జైన్‌కు మర్దన చేసిన వ్యక్తి ఫిజియోథెరపిస్టు కాదు. ఒక రేపిస్టు. దీనిని కూడా ఆప్ సమర్థించుకుంటుందా..? వారు తిహాడ్‌ను థాయ్‌లాండ్‌గా మార్చుకున్నారు’ అంటూ భాజపా మండిపడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని