Nitish Kumar: నీతీశ్‌జీ.. ప్రధాని కావాలనే పగటికలలు మానండి: భాజపా కౌంటర్‌

ప్రధానమంత్రి పదవి ఖాళీగా లేదని, అందువల్ల బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ (Nitish Kumar) తన పగటికలలు మాని తన రాష్ట్రంపై దృష్టిపెట్టాలని భాజపా (BJP) దుయ్యబట్టింది. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో నీతీశ్ భేటీ నేపథ్యంలో కాషాయ పార్టీ ఈ విమర్శలు గుప్పించింది.

Published : 22 May 2023 10:56 IST

దిల్లీ: భాజపా (BJP)కు వ్యతిరేకంగా విపక్షాలను ఐక్యం చేయడంలో బిజీబిజీగా ఉన్నారు బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ (JDU) అధినేత నీతీశ్ కుమార్‌ (Nitish Kumar). గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష నేతలతో వరుస సమావేశాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం దిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)తో నీతీశ్ భేటీ అయ్యారు. దీనిపై స్పందించిన భారతీయ జనతా పార్టీ.. జేడీయూ నేతపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. నీతీశ్‌జీ.. ప్రధాని కావాలనే పగటికలలు మాని బిహార్‌పై దృష్టి పెట్టాలని ఎద్దేవా చేసింది.

బిహార్‌ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav)తో కలిసి దిల్లీకి వెళ్లిన నీతీశ్‌.. ఆదివారం కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌లా ఓ ‘రాజ్యసభ ప్లాన్‌ (Rajyasabha Plan)’ను నీతీశ్‌ వద్ద ప్రతిపాదించినట్లు సమాచారం. అంతేగాక, పాలనావ్యవహారాల విషయంలో ఆప్ ప్రభుత్వానికి అనుకూలంగా ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తప్పించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను కూడా నీతీశ్‌ వ్యతిరేకించారు.

ఈ క్రమంలోనే తాజా పరిణామాలపై భాజపా (BJP) జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్‌ శుక్లా స్పందిస్తూ నీతీశ్‌ (Nitish Kumar)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ఇతర పార్టీల నేతలతో నీతీశ్‌ సమావేశమవడం సరైందే కావొచ్చు. కానీ, ఆయన తన సొంత రాష్ట్రంపై దృష్టి పెట్టట్లేదు. ప్రధానమంత్రి కావాలని ఆయన పగటికలలు కంటున్నారు. అవి మాని.. బిహార్ ముఖ్యమంత్రిగా తన రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నిర్వర్తిస్తే మంచిది’’ అని ఎద్దేవాచేశారు. బిహార్‌లోని భాజపా ఎమ్మెల్సీ సంజయ్‌ మయూఖ్‌ స్పందిస్తూ.. ‘‘నీతీశ్‌జీ తన కలల ప్రపంచం నుంచి బయటకు రావాలి. ప్రధాని పోస్ట్‌ ఖాళీగా లేదు’’ అని ఎద్దేవా చేశారు.

2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత (Opposition Unity)పై ఆయా పార్టీల నేతల మధ్య సమాలోచనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గత కొన్ని రోజులుగా వేగం పెంచిన నీతీశ్ కుమార్‌.. విపక్ష నేతలతో విస్తృత చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రధాని పదవికి పోటీ చేయాలని నీతీశ్‌ ప్రయత్నిస్తున్నారంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, వీటిని బిహార్‌ సీఎం ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూనే ఉన్నారు. తనకు ప్రధాని కావాలనే ఆశ లేదని, విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కలిసి ముందుకెళ్తే చూడాలన్నదే తన కల అని గతంలో ఆయన ఓసారి స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని