
దాడులతో శాంతి ప్రయత్నాలు ఆగవు: మల్కా
దిల్లీ: పశ్చిమాసియాలో అస్థిరత కోరుకునే వారి దాడులు మమ్మల్ని భయపెట్టలేవని ఇజ్రాయెల్ రాయబారి రాన్ మల్కా తెలిపారు. దిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ సమీపంలో జరిగిన బాంబు దాడి విషయమై దర్యాప్తులో భారత అధికారులకు సహకరిస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
‘పశ్చిమాసియాలో అస్థిరత కోరుకునే వారి దాడులు మమ్మల్ని భయపెట్టలేవు. శాంతి కోసం మేం చేస్తున్న ప్రయత్నాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి. ఈ దాడి దర్యాప్తు విషయంలో ఇజ్రాయెల్ అధికారులు, ఎంబసీ నుంచి కావల్సిన సహకారం ఉంటుంది’ అని మల్కా తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతంలో లభించిన లేఖ ఇరాన్‌తో సంబంధాలను సూచిస్తోందని ప్రశ్నించగా మల్కా స్పందిస్తూ.. ‘విచారణ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. దర్యాప్తునకు హాని కలిగించే విషయాల గురించి మనం ముందే చర్చించడం సముచితం కాదు. ముందుగా పూర్తి సమాచారం, సాక్ష్యాధారాలు సేకరించి ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకుంటామని’ మల్కా అన్నారు.
‘ఇది ఉగ్రదాడి అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు మన రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై నిన్నటితో 29ఏళ్లు గడిచింది. అదే రోజున ఈ దాడి జరిగింది. కాగా గత కొన్ని వారాల నుంచే ఇంటలిజెన్స్ నుంచి సమాచారం ఉంది కాబట్టి ఇది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. 2012లో ఇజ్రాయెల్ రాయబారులపై జరిగిన దాడికి, ఈ ఘటనకు ఏదైనా సంబంధం ఉందా అన్న కోణంలోనూ విచారణ జరుగుతోందని’ అని మల్కా పేర్కొన్నారు.
దిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద శుక్రవారం బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ దాడికి తామే కారణమంటూ ‘జైషే ఉల్ హింద్’ ఉగ్ర సంస్థ ప్రకటించుకున్నట్లు పలు జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
ఇదీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.