Omicron XE: భారత్‌లో ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌ కలకలం.. గుజరాత్‌లో తొలి కేసు నమోదు..!

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోన్న సమయంలో కొత్త వేరియంట్‌ ‘ఎక్స్‌ఈ’ కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ముంబయిలో ఈ రకం కేసు బయటపడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే

Published : 09 Apr 2022 10:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోన్న సమయంలో కొత్త వేరియంట్‌ ‘ఎక్స్‌ఈ’ కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ముంబయిలో ఈ రకం కేసు బయటపడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్‌లోనూ తొలి ఒమిక్రాన్‌ ‘ఎక్స్‌ఈ’ కేసు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారిక వర్గాల సమాచారం. అయితే అది కచ్చితంగా ఎక్స్‌ఈ వేరియంటేనా కాదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.

ఎక్స్‌ఈ వేరియంట్ సోకినట్లుగా భావిస్తోన్న వ్యక్తి నమూనాలను నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ)కు పంపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నది మాత్రం పేర్కొనలేదు. సదరు వ్యక్తి మార్చి 13న కొవిడ్‌ బారిన పడగా.. వారానికి కోలుకున్నట్లు తెలుస్తోంది. అయితే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో ఎక్స్‌ఈ వేరియంట్‌ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవడంతో తదుపరి విశ్లేషణ నిమిత్తం ఎన్‌సీడీసీకి పంపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఇటీవల ముంబయిలోని ఓ మహిళకు ఎక్స్‌ఈ వేరియంట్‌ సోకినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ప్రస్తుతమున్న ఆధారాలను బట్టి అది కచ్చితంగా ఎక్స్‌ఈ వేరియంటేనని చెప్పలేమని తెలిపింది. మహిళ నమూనాల్లో ఉన్న మ్యుటెంట్‌ జెనెటిక్‌ మేకప్‌.. ఎక్స్‌ఈ మ్యుటెంట్‌తో సరిపోలడం లేదని ఇన్సాకాగ్‌ పరిశోధనలో తెలిసిందని కేంద్రం వెల్లడించింది. అయితే గుజరాత్‌లో వెలుగు చూసిన వేరియంట్‌ ఎక్స్‌ఈ రకమేనా కాదా అన్నది అధ్యయనం చేయాల్సి ఉంది..!

ఏంటీ ఎక్స్‌ఈ వేరియంట్‌..

ఒమిక్రాన్‌లోని రెండు సబ్‌ వెర్షన్లు బీఏ.1, బీఏ.2 కలిసి ఎక్స్‌ఈ వేరియంట్‌గా రూపాంతరం చెందాయి. తొలిసారిగా యూకేలో బయటపడిన ఈ వేరియంట్‌.. ఆ తర్వాత పలు దేశాలకు వ్యాపించింది. దీని వ్యాప్తి వేగం ఒమిక్రాన్‌ కంటే 10 రెట్లు ఎక్కువ కావడంతో కేసులు పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రాణాంతకమైన తీవ్ర లక్షణాలు ఉండకపోవచ్చని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని