India-Canada: ‘దౌత్యవేత్తల తగ్గింపు’ వివాదం.. కెనడాకు భారత్‌ గట్టి కౌంటర్‌

India Canada Diplomatic Row: భారత్‌ నుంచి 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి రప్పించినట్లు ప్రకటించిన కెనడా.. మరోసారి దిల్లీపై విమర్శలు చేసింది. అయితే, ఆరోపణలను కేంద్ర విదేశాంగ శాఖ గట్టిగా తిప్పికొట్టింది.

Published : 20 Oct 2023 16:19 IST

దిల్లీ: భారత్‌, కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలు (India Canada Diplomatic Row) మళ్లీ వేడెక్కాయి. భారత్‌లో దౌత్య సిబ్బందిని (Diplomatic Staff) తగ్గించడంపై అధికారిక ప్రకటన చేసిన కెనడా.. న్యూదిల్లీ అల్టిమేటం అంతర్జాతీయ చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ అక్కసు వెళ్లగక్కింది. అయితే, ఈ ఆరోపణలపై తాజాగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పందిస్తూ.. కెనడాకు దీటుగా బదులిచ్చింది. చట్టాలకు అనుగుణంగానే తాము.. ఒట్టవాకు దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని సూచించినట్లు స్పష్టం చేసింది.

భారత్‌లో 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి రప్పించినట్లు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ (Melanie Joly) ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్‌పై మరోసారి ఆరోపణలు చేశారు. ‘‘భారత్‌లో దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించకపోతే.. అదనంగా ఉన్న వారికి దౌత్యపరమైన రక్షణ ఎత్తివేస్తామని దిల్లీ తెలిపింది. ఇది అసమంజసం, అనూహ్య నిర్ణయం. దౌత్య సంబంధాల కోసం ఏర్పాటు చేసుకున్న వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమే’’ అని మోలానీ ఆరోపించారు.

‘భారత్‌లో ఆ నగరాల్లో జాగ్రత్త..’: మరోసారి కెనడా కవ్వింపులు

దీంతో ఈ వ్యవహారంపై స్పందించిన భారత విదేశాంగ శాఖ (MEA).. కెనడా ఆరోపణలను తిప్పికొడుతూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘భారత్‌లో దౌత్య సిబ్బంది సంఖ్యపై కెనడా ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను చూశాం. భారత్‌లో కెనడా దౌత్యవేత్తల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అంతేగాక, మన అంతర్గత వ్యవహారాల్లో వారు తరచూ జోక్యం చేసుకుంటున్నారు. న్యూదిల్లీ, ఒట్టావా దౌత్యసంబంధాల్లో పరస్పర సమానత్వం ఉండాలని మేం కోరుకుంటున్నాం. దీని గురించి గత నెల రోజులుగా కెనడాతో చర్చలు జరిపాం. వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్‌ 11.1 నిబంధనలకు అనుగుణంగానే.. దౌత్యసిబ్బంది సంఖ్యలో సమానత్వాన్ని అమలు చేసేందుకు మేం చర్యలు తీసుకున్నాం. సమానత్వ అమలును.. నిబంధనల ఉల్లంఘనగా చిత్రీకరించే ప్రయత్నాలను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో(Justin Trudeau) చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఇదే సమయంలో భారత అంతర్గత విషయాల్లో కెనడా దౌత్యవేత్తలు అతిగా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ.. దౌత్య సిబ్బంది సంఖ్య విషయంలో సమస్థాయిని పాటించాలని సూచించింది. ఈ క్రమంలోనే భారత్‌లో కెనడా తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని న్యూదిల్లీ అల్టిమేటం జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే భారత్‌ నుంచి 41 మంది దౌత్యసిబ్బందిని వెనక్కి రప్పించినట్లు కెనడా తాజాగా అధికారికంగా ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని