
భర్తను చంపినా..భార్యకు పింఛను ఇవ్వాల్సిందే
పంజాబ్, హరియాణా హైకోర్టు అసాధారణ తీర్పు
చండీగఢ్: ‘ప్రభుత్వ ఉద్యోగి భార్యకున్న కుటుంబ పింఛను హక్కు కాదనలేనిది. ఒకవేళ ఆమె తన భర్తను చంపినా సరే.. భర్త మరణానంతరం పునర్వివాహం చేసుకున్నా సరే’ అంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు ఇటీవల ఓ కేసులో అసాధారణ తీర్పు చెప్పింది. ‘బంగారుగుడ్లు పెట్టే కోడిని ఎవరూ కిరాతకంగా చంపుకోరు’ అంటూ ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ‘కుటుంబ పింఛను అనేది సంక్షేమ పథకం. ప్రభుత్వ ఉద్యోగి చనిపోయినపుడు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు దాన్ని ప్రవేశపెట్టారు. క్రిమినల్ కేసులో ఆమెకు జైలుశిక్ష పడ్డా ఈ పథకం కింద భార్యకున్న హక్కును కాదనలేం’ అంటూ హరియాణాలోని అంబాలాకు చెందిన బల్జీత్ కౌర్ అనే మహిళ దాఖలు చేసిన పిటిషను విచారణ సందర్భంగా జనవరి 25న హైకోర్టు వ్యాఖ్యానించింది.
హరియాణా ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆమె భర్త తర్సెమ్‌సింగ్ 2008లో చనిపోయారు. 2009లో ఆమెపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. 2011లో శిక్ష పడింది. అప్పటిదాకా బల్జీత్ కౌర్‌కు అందుతున్న కుటుంబ పిఛన్‌ను శిక్ష పడగానే హరియాణా ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వ ఉత్తర్వులను పక్కనపెడుతూ బల్జీత్‌కౌర్‌కు రావాల్సిన కుటుంబ పింఛను, పాత బకాయిలు రెండు నెలల్లో విడుదల చేయాల్సిందిగా హైకోర్టు సంబంధిత శాఖను ఆదేశించింది. భర్త మరణానంతరం కుటుంబ పింఛను హక్కుదారు భార్యేనంటూ 1972 సీసీఎస్ (పింఛను) నిబంధనల మేరకు హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది.
ఇవీ చదవండి..
నగదు వేసినా... తీసినా బాదుడే!
సంక్షోభం నుంచి సంక్షేమానికి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.