JK: అమిత్‌ షా కీలక ప్రకటన.. ఆ వర్గానికి కోటా అమలుకు హామీ!

జమ్మూకశ్మీర్‌ పర్యటనలో ఉన్న కేంద్ర హోమంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. గుజ్జర్లు, బకర్వాల్‌లతో పాటు పహారీ సామాజిక వర్గానికీ ఎస్టీ హోదా కల్పించి  త్వరలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కోటా ప్రయోజనాలు పరిశీలించేందుకు......

Updated : 24 Nov 2022 12:52 IST

గుజ్జర్‌, బకర్వాల్‌తో పాటు పహారీ వర్గానికి ఎస్టీ హోదాకు హామీ

రాజౌరి: జమ్మూకశ్మీర్‌ పర్యటనలో ఉన్న కేంద్ర హోమంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. గుజ్జర్లు, బకర్వాల్‌లతో పాటు పహారీ సామాజిక వర్గానికీ ఎస్టీ హోదా కల్పించి  త్వరలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కోటా ప్రయోజనాలు పరిశీలించేందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఏర్పాటు చేసిన జస్టిస్‌ శర్మ కమిషన్‌ సిఫారసుల మేరకు ఈ కోటా అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఎస్టీ కోటాలో గుజ్జర్లు, బకర్వాల్‌లు, పహారీలకు ఎలాంటి తగ్గుదల ఉండదన్న ఆయన.. ప్రతి ఒక్కరూ తమ వాటాను పొందుతారని స్పష్టంచేశారు. రాజౌరిలో ఏర్పాటు చేసిన భాజపా ర్యాలీలో ఆయన ప్రసంగించారు.  2019లో ఆర్టికల్ 370 రద్దు చేయడంతో జమ్మూకశ్మీర్‌లోని సమాజంలో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు అందించేందుకు మార్గం సుగమమైందన్నారు.  చట్టపరమైన ప్రక్రియ పూర్తి కాగానే ఆయా వర్గాల ప్రజలు రిజర్వేషన్‌ ప్రయోజనాలు పొందనున్నారు. అయితే, పహారీలకు ఎస్టీ హోదా మంజూరైతే ఒక భాష మాట్లాడే సమూహానికి దేశంలో రిజర్వేషన్లు కల్పించడం ఇదే తొలిసారి కానుంది. ఇది కార్యరూపం దాల్చాలంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో రిజర్వేషన్ల చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. 

మరోవైపు, జమ్మూకశ్మీర్‌లో విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో రాష్ట్రంగా ఉన్నప్పుడు జమ్మూకశ్మీర్‌ను కేవలం మూడు రాజకీయ కుటుంబాలే (ఎవరి పేర్లూ ప్రస్తావించలేదు) పాలించేవని మండిపడ్డ అమిత్‌ షా.. ఇప్పుడు పంచాయతీలు, కౌన్సిల్‌లకు న్యాయమైన ఎన్నికల ద్వారా ఎన్నికైన  30వేల మంది వ్యక్తుల వద్ద అధికారం ఉందన్నారు. ఇంతకుముందు జమ్మూకశ్మీర్‌ అభివృద్ధికి కేంద్రం పంపిన డబ్బంతా కొందరే దోచుకున్నారని.. కానీ ఇప్పుడు ప్రజల సంక్షేమం కోసం ఆ నిధులు ఖర్చవుతున్నాయన్నారు. ఉగ్రవాదుల ఆగడాలను కట్టించేందుకు మోదీ తీసుకున్న పటిష్ట చర్యల కారణంగానే భద్రతా సిబ్బంది మరణాలు తగ్గుతున్నాయన్నారు. గతంలో ఏడాదికి 1200 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ సంఖ్య ఇప్పుడు 136కి తగ్గిందన్నారు. జమ్మూకశ్మీర్‌ అభివృద్ధికి ప్రధాని మోదీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని